లచిత్ బడ్ ఫుకాన్ (Lachit Borphukan)… ఈశాన్య ప్రాంతాల శివాజీ (Shivaji)…అసోం రాజ్య సేనాధిపతిగా మొఘల్స్ పై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వీరుడు ఆయన. మొఘల్ రాజుల చెర నుంచి గౌహతిని విడిపించిన గొప్ప పోరాట యోధుడు ఆయన. ఔరంగజేబు సేనలను తరమికొట్టిన అరివీర భయంకరుడు ఆయన.
24 నవంబర్ 1622లో అసోంలోని ప్రాగ్జోతిష్యపూర్ ప్రాంతంలో లచిత్ బడ్ ఫుకాన్ జన్మించారు. తండ్రి పేరు మోమై తములి బోర్పురువా. చిన్నతనం నుంచే యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. లచిత్ ఖాన్ ప్రతిభను గుర్తించిన అసోం రాజు చక్రధ్వజ్ సింగ్ ఆయన్ని తన సైన్యంలో కమాండర్ గా నియమించారు.
మొహమ్మద్ ఘోరి కాలం నుంచి ముస్లిం రాజుల కన్ను అసోం రాజ్యంపై పడింది. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. అసోం రాజులు తమ వీరోచిత పోరాటాలతో ఎప్పటికప్పుడు మొఘల్ రాజులను ఎదుర్కొంటూ వచ్చారు. ఆ తర్వాత అసోం రాజ్యంలో అంతర్గత కలహాలను ఆసరాగా చేసుకుని గౌహతిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే మిగిలిన అసోం రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పన్నాయి. ఈ మేరకు 1671లో రాజా రాంసింగ్ నేతృత్వంలో మొఘల్ సేనలు బ్రహ్మపుత్ర నదీ తీరంలో సరాయి ఘాట్ ప్రాంతలో మోహరించాయి. విషయం తెలుసుకున్న చక్రధ్వజ సింహా తన సైన్యాధిపతి లచిత్ బడ్ ఫుకాన్ ను సరాయి ఘాట్ కు పంపించాడు.
మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తూ… భౌగోలిక పరిస్థితులను ఉపయోగించుకుంటూ అత్యంత చాకచక్యంగా ప్రణాళికలు రచించి మొఘల్ సేనలను ఊచ కోత కోశాడు. దీంతో కుట్రలతో లచిత్ బడ్ ఫుకాన్ ను హతమార్చాలని మొఘల్ సేనలు ప్రయత్నించాయి. లచిత్ బడ్ ఫుకాన్ తమకు అమ్ముడు పోయాడంటూ వదంతులు పుట్టించాయి.
ఈ క్రమంలో లచిత్ బడ్ ఫుకాన్ పై రాజు చక్రధ్వజ సింగ్ కు అనుమానాలు పెరిగాయి. కానీ లచిత్ బడ్ ఫుకాన్ దేశ భక్తిని శంకించాల్సిన పనిలేదని, ఆయన నిజాయితీ గల గొప్ప సేనాని అని రాజుకు ఆయన మంత్రి వివరించారు. దీంతో లచిత్ బడ్ ఫుకాన్ పై చక్రధర్ కు మళ్లీ నమ్మకం కలిగింది. ఈ యుద్దంలో గాయపడినలచిత్ బడ్ ఫుకాన్ తర్వాత అనారోగ్యానికి గురై మరణించారు.