రాజా వెంకటప్ప నాయక…. షోరాపూర్ వంశానికి చెందిన గొప్ప పాలకుడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమత్వాన్ని అంగీకరించేందుకు నిరాకరించిన గొప్ప అభిమాన ధనుడు. బ్రిటీష్ సేనలపై వీరోచితంగా పోరాటం చేసిన గొప్ప యోధుడు. తనకు మరణశిక్ష విధించాలంటే ఓ నేరస్థుడిలా ఉరితీయకూడదని, ఓ వీరున్ని చంపినట్టుగా ఫిరంగితో కాల్చి చంపాలని కోరిన గొప్ప వీరుడు.
1858లో నేటి కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలోని షోరాపూర్ గ్రామంలో జన్మించారు. ఈ జిల్లాను వాల్మీకి నాయక వంశానికి చెందిన పాలకులు పరిపాలిస్తు ఉండే వారు. వెంకటప్ప నాయక చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించారు. వెంకటప్ప నాయక్ మైనర్ కావడంతో ఆ జిల్లాకు పిలిప్ మీడోస్ టేలర్ అనే వ్యక్తిని రెసిడెంట్ అధికారిగా బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది.
టేలర్ ను వెంకటప్పయ్య ప్రేమగా అప్పా అని పిలిచేవారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్య పాలన చేపట్టారు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం చూసి ఆయన విసుగు చెందారు. దీంతో వారి అధికారాన్ని వెంకటప్పయ్య తిరస్కరించారు. డిసెంబర్ 1857లో నానా సాహెబ్ వద్దకు తన ఏజెంట్ ను వెంకటప్పయ్య పంపించారు. విషయం తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం సురాపూర్ గ్రామానికి క్యాంప్ బెల్ అనే అధికారిని పంపింది.
కానీ మార్గ మధ్యలోనే క్యాంప్ బెల్ సేనలపై వెంకటప్పయ్య దళాలు దాడి చేసి ఊచకోత కోశాయి. దీంతో పెద్ద ఎత్తున బ్రిటీష్ సైన్యం షోరాపూర్ పై దాడి చేయగా వెంకటప్పయ్య హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అక్కడ సాలార్ జంగ్ ఆయన్ని బ్రిటీష్ ప్రభుత్వానికి పట్టించారు. దీంతో ఆయనకు జీవిత శిక్షవిధించగా టేలర్ అభ్యర్థన మేరకు ఆ శిక్షను నాలుగేండ్లకు తగ్గించారు.
అతన్ని కర్నూలు కోటకు తీసుకువెళ్తుండగా తెల్లవారుజామున తన సాయుధ గార్డు దగ్గర తుపాకీ తీసుకుని తనను కాల్చుకుని మరణించారు. ఆయన మరణంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన్ని బ్రిటిష్ అధికారి ఒకరు వెనుక నుండి కత్తితో పొడిచి చంపారని…. హైదరాబాద్లోని అంబర్పేట సమీపంలో ఆయన మృత దేహాన్ని పాతిపెట్టారని చెబుతారు.