గురునానక్ ( Guru Nanak)… సిక్కు మత స్థాపకులు. సిక్కుల మొదటి గురువు. మీరు సిక్కు లేదా హిందువు (HIndu)గా లేదా క్రిస్టియన్‌గా మారడానికి ముందు మీరు నిజమైన మనుషులుగా మారండని చెప్పిన గొప్ప గురువు. మనుషులందరినీ సమానంగా చూసేవాడే నిజమైన మతస్థుడని చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త గురునానక్.
1469లో పంజాబ్ లోని తల్వాండీ గ్రామం (ప్రస్తుతం లాహోర్)లో గురునానక్ జన్మించారు. తండ్రి మెహతా కలు. బాల్యం నుంచే ప్రశ్నించే, ఆలోచించే తత్వాన్ని గురునానక్ అలవర్చుకున్నారు. చిన్న తనం నుంచే హిందూ మతంలోని తాత్విక భావాల పట్ల ఆకర్షితుడయ్యారు. మానవ జీవిత రహస్యాలను అన్వేషించాలని నిశ్చయించుకుని ఇంటిని వదిలి వెళ్లాడు.
హిందూమతంతో పాటు ఇస్లామియా గ్రంథాలను ఆయన సంపూర్ణంగా అధ్యయనం చేశారు. ఇరు మతాలు బోధించిన మంచి విషయాలను ఆయన గ్రహించారు. కానీ మతం బోధిస్తున్న మంచిన ఆచరించడంలోనే లోపాలు ఉన్నాయని గుర్తించారు. వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. లోకంలో జరుగుతున్న మూఢాచారాలు, మతం పేరిట జరుగుతున్న అనాచారాలను ఆయన వ్యతిరేకించారు.
ఈ క్రమంలో 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించారు. తోటి వారి ప్రేమను పొందగలిగే వారే ఆ భగవంతున్ని చూడగలరని బోధించారు. ప్రపంచ యాత్రలు చేస్తూ సర్వమత సామరస్యాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన బోధనలన్నింటినీ ‘గురు గ్రంథ్ సాహిబ్’లో పొందుపరిచారు. గురునానక్ చూపిన ముక్తి మార్గాన్ని ఇప్పుడు సిక్కులు భక్తి శ్రద్దలతో పాటిస్తున్నారు.