యూపీలో యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హలాల్ ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హలాల్ ఉత్పత్తులను తయారు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి హలాల్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో హలాల్ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
‘హలాల్’అనేది చాప కింద నీరులాగా అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తోందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మాంస పరిశ్రమలో మొదలైన ఈ ‘హలాల్’ నెమ్మదిగా అన్ని రంగాల్లో ప్రవేశిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హలాల్ ఇండస్ట్రీ ద్వారా ‘ఎకనామిక్ జిహాద్’ను సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
అసలు ‘హలాల్’ అంటే అర్థం ఏమిటీ…!
‘హలాల్’అనేది అరబ్బీ భాష నుంచి వచ్చిన పదం. ‘హలాల్’అంటే ధర్మబద్దమైనది లేదా అనుమతించబడినది అని అర్థం. ఇది ‘హరామ్’అనే పదానికి వ్యతిరేకం. హరామ్ అంటే నిషేధించబడినది లేదా అధర్మమైనది. హలాల్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆహార పదార్థాలను, హలాల్ చేసిన తర్వాత మాత్రమే ఆహారపదార్థాలను భుజించడమనేది ఇస్లామిక్ దేశాల్లో కొనసాగుతోంది.
హలాల్ ఎందుకు, ఎలా చేస్తారు….!
జంతువుల రక్తాన్ని మాంసంతో కలపడాన్ని ఇస్లాం నిషేధించింది. అందుకే మాంసం పరిశ్రమలో జంతువుల గొంతుకను కోసి పూర్తి రక్తం బయటకు వచ్చేలా చేస్తారు. అలా చేస్తే పూర్తి రక్తం పోయి జంతువులు నొప్పి లేకుండా మరణిస్తాయని ప్రచారంలో ఉంది. జంతువులను కోస్తున్న సమయంలో ఖల్మాను చదువుతారు. అలా హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే ముస్లింలు తింటారు.
హలాల్ కు జట్కాకు తేడా ఏంటీ…..!
జట్కా అనే సాంప్రదాయాన్ని హిందువులు ఎక్కువగా పాటిస్తారు. సాధారణంగా గ్రామ దేవతల దగ్గర జంతువులను బలి ఇచ్చే సమయంలో ఒక్క వేటుతో జంతువు తల, మొండాన్ని వేరు చేస్తారు. దీన్ని మన దగ్గర మాంసం షాపుల్లో ఇదే పద్దతిని ఉపయోగిస్తారు. కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు హలాల్ మాంసానికి డిమాండ్ పెరిగింది.
మాంసం మార్కెట్ పై ‘హలాల్’ఆధిపత్యం…!
ముస్లింలు హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. ఇతర పద్దతుల్లో తయారు చేసిన మాంసాన్ని వారు ముట్టుకోరు. అందుకే వారు ప్రత్యేకంగా హలాల్ మాంసాన్ని డిమాండ్ చేస్తారు. అదే ఇతర సామాన్య హిందువులకు అలాంటి పట్టింపులు ఏవీ ఉండవు. అందుకే చాలా వరకు రెస్టారెంట్లు, ఎయిర్ లైన్స్, ఇతర భారతీయ కంపెనీలు హలాల్ మాంసాన్ని మాత్రమే వడ్డిస్తున్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
హలాల్ పై మొదలైన ఆందోళనలు….!
హలాల్కు డిమాండ్ పెరగడంతో మాంసం దుకాణాల్లో, రెస్టారెంట్లలో ‘హలాల్’స్పెషల్ అంటూ బోర్డులు వెలుస్తున్నాయి. దీంతో చాలా వరకు మాంసం దుకాణాల్లో హలాల్ చేసే వారిని మాత్రమే పనిలోకి తీసుకుంటున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో చాలా మంది హిందువులు ఉపాధిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హలాల్ సర్టిఫికేషన్ …..!
గతంలో ‘హలాల్’ అనేది కేవలం మాంసం పరిశ్రమకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇటీవల ఆ పద్దతి ఇతర రంగాలకు కూడా పాకింది. చాలా దేశాల్లో ముస్లింలు కేవలం హలాల్ ఉత్పత్తులనే వాడతామని చెబుతున్నారు. దీంతో చాలా వరకు కంపెనీలు కూడా ‘హలాల్’ సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్టులకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో హలాల్ తయారీని ద్రువీకరించేందుకు ఓ ప్రత్యేకమైన ముస్లిం సంస్థ అవసరం అవుతోందని హిందూ సంఘాలు అంటున్నాయి.
ఉగ్రసంస్థలకు నిధులు…!
‘హలాల్’నేపథ్యంలో చాలా వరకు ముస్లిం సంస్థలు ఇస్లామిక్ గ్రంథాలు, మత విధానాలు తెలిసిన సర్టిఫైడ్ ముల్లాలు లేదా మత బోధకులను నియమించుకుంటున్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి. హలాల్ ట్యాక్స్ పేరిట ముస్లిం సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని పేర్కొంటున్నాయి. ఆ నిధులతో ఆయా సంస్థలు ఉగ్ర మూకలకు సహాయం చేస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఉగ్రవాదం మరింత బలపడుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హలాల్ పేరిట ఎకనామిక్ జిహాద్ సృష్టిస్తున్నాయంటూ మండిపడుతున్నాయి.