తమ చేతుల్లో బందీగా వున్న ఇద్దరు అమెరికా (USA) పౌరులను హమాస్ (Hamas) విడిచి పెట్టింది. హమాస్ చెర నుంచి విడుదలైన తల్లి కూతుళ్లు తమ కుటుంబాన్ని కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలావుంటే ఆ ఇద్దరు అమెరికన్ పౌరులతో కలిపి మిలిటెంట్ల చేతిలో మొత్తం 210 మంది బంధీగా వున్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.
లెబనాన్ కు చెందిన సాయుధ సంస్థ హెజ్బొల్లా కూడా యుద్ధంలో చేరాలని అనుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఒక వేళ అదే నిజమైతే ఆ దాడులకు లెబనాన్ తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సౌత్ లెబనాన్ నుంచి హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు చేస్తోంది.
ఇది ఇలావుంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన గాజాలో పౌరులకు మానవతా సాయాన్ని అందించాలని ఐక్య రాజ్య సమితి చేసిన ప్రయత్నం ఫలించింది. సుమారు 200 ట్రక్కుల్లో 3 వేల టన్నులకు పైగా సామగ్రిని గాజా సరిహద్దుకు చేరుకుంది. మరోవైపు జెడ్డాలో అజర్ బైజాన్ ఆర్థిక మంత్రి ఇరాన్ జైహూన్ బైరామోవ్ తో ఆర్థిక మంత్రి హుస్సేన్ అమిరాబ్ దుల్హేన్ సమావేశం అయ్యారు.
ఇక పాలస్తీనా వ్యతిరేక ట్వీట్లు చేసినందుకు భారతీయ డాక్టర్ సునీల్ రావును ఉద్యోగంలోనుంచి తొలగిస్తున్నట్టు రాయల్ హాస్పిటల్ ఆఫ్ బహ్రెయిన్ వెల్లడించింది. ఈజిఫ్ట్, జోర్డాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు ఇజ్రాయెల్ ట్రావెల్ అడ్వయిజరీ ఇచ్చింది. ఇజ్రాయెల్ కు చెందిన పౌరులెవరూ ఆయా దేశాలకు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. ఆయా దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులు వెంటనే వీలైనంత త్వరగా ఇజ్రాయెల్ వచ్చేయాలని సూచించింది. ప్రయాణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్, పీఐజే మిలిటెంట్లు రాకెట్ దాడి చేశారని ఐడీఎస్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అందులో 550కు పైగా విఫలమయ్యాయన్నారు. ప్రయోగించే సమయంలోనే విఫలమై ఆ రాకెట్లు వారి భూభాగంలోనే పడిపోయాయని వెల్లడించారు. రాకెట్లతో వారు తమ సొంత పౌరులనే చంపేస్తున్నారన్నారు.