అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగం అందరినీ తీవ్రంగా నిరాశ పరిచిందని అన్నారు. గవర్నర్ ప్రసంగం ఓ విజన్ లాగా ఉండాలని అన్నారు. కానీ గవర్నర్ ప్రసంగం ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించలేక పోయిందని విమర్శలు గుప్పించారు.
రాబోయే ఏడాదిలో ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఉండాలని అన్నారు. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రసంగం చాలా నిరాశ పరిచిందన్నారు. నిరుద్యోగ భృతి గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పారు. ఆసరా పెన్షన్ , మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తామో చెప్పని ప్రసంగం నిరాశ పరిచిందన్నారు.
గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలు అవ్వడం లేదని తెలిపారు. మహాలక్ష్మీ కింద మూడు గ్యారెంటీలు ఉంటే కేవలం ఒక్క దానిని మాత్రమే ఇచ్చారని ఫైర్ అయ్యారు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమందంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకోవాల్సిన దరఖాస్తులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తమ హయాంలో మూసీ నది అభివృద్ధికి ఎస్టీపీలను నిర్మించామన్నారు. మూసీ అభివృద్ధి అంటే మురుగు నీరు చేరకుండా చూడాలన్నారు. 6, 7 తేదీలు దాటినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని నిప్పులు చెరిగారు. యాదాద్రి 4 వేల మెగావాట్ల పవర్ పాయింట్ గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదన్నారు. విద్యుత్ సంస్థల అభివృద్ధి ఊసే లేదన్నారు.
ప్రమాణ స్వీకారం రోజు నుంచి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని… కానీ వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చ్ 17 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తుందన్నారు.. 6 గ్యారెంటీలు ఏఏ తేదీల్లో అమలు చేస్తారో ప్రసంగంలో చెప్పలేదని ఫైర్ అయ్యారు.. త్వరలో ఎన్నికల కోడ్ వస్తోందన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారు.. హామీలను అమలు చేయలేమని కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందన్నారు.