సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏదన్నా మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చటను సీఎం తీసుకు వస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్ చేయాలని సూచించారు. పదే పదే తమను కించపరిచి, రాజకీయంగా విమర్శిస్తామనుకుంటే అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ….. కాంగ్రెస్ వాళ్లు అమరవీరుల పాడే మోసినోళ్లు కాదని తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. గతంలో అమరవీరులకు శ్రద్దాంజలి కూడా ఘటించలేదని చెప్పారు. కనీసం వాళ్ల కుటుంబాలను కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. తుపాకులతో ఉద్యమకారులను బెదిరించిన మీకు తెలంగాణ పోరాటం, అమరవీరులకు గురించి తెలుస్తదని తాను అనుకోనన్నారు.
నాగార్జున సాగర్ విషయంలో సభను సీఎం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. శ్రీశైలం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణలో కంట్రోల్‌లోకి ఇచ్చారని పేర్కొన్నారు. రెండు నెలలు గడుస్తున్నా సీఆర్పీఎఫ్ భద్రతలో సాగర్ ఉందని వివరించారు. సాగర్‌ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకునేందుకు కృషి చేయాలని కోరారు. దీనికోసం సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఎస్ఎల్‌బీసీ విషయంలోనూ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పదేండ్లలో కిలోమీటర్ తవ్వారని మొన్న ప్రెస్ మీట్‌లో వెల్లడించారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వినట్లు గుర్తు చేశారు. దీన్ని సీఎం కరెక్షన్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి మాట్లాడెప్పుడు అవగాహనతో మాట్లాడాలని సూచించారు.