సిద్దిపేట (Siddipet) నంగునూరు మండలం ముండ్రాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ని ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు (Harish Rao). ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ బ్యాంక్ ఏర్పాటుతో మంచి సౌకర్యం అందుతుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కొత్తలో రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడ్డారని.. కానీ, ఇప్పుడు ముండ్రాయిలో నాలుగు వరుసల రోడ్డు రాబోతోందని తెలిపారు.
గతంలో మహిళా సంఘాలు లోన్ల కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండేదని.. ఇప్పటి నుండి ఆ తిప్పలు లేకుండా డీసీసీబీ బ్యాంక్ ఉపయోగ పడుతుందన్నారు హరీశ్ రావు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో ఈ బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఎరువుల బస్తా కోసం కాంగ్రెస్ జమానాలో ఎన్నో కష్టాలు పడ్డామని.. చెప్పులు లైన్ లో పెట్టి చూసేవాళ్లమని ఆనాటి విషయాల్ని గుర్తు చేశారు.
కేసీఆర్ (KCR) పాలనలో ఎరువుల కష్టాలు లేవన్న హరీశ్.. రైతు విలువ పెంచామని అన్నారు. అందుకే భూమి విలువ కూడా పెరిగిందని చెప్పారు. నీళ్లు లేక ఇబ్బంది పడ్డ రోజుల నుండి నీళ్ళు ఎక్కువయ్యాయి అనేకాడికి తెలంగాణ చేరిందన్నారు. రైతు బీమా రైతు కుటుంబానికి బాసటగా ఉపయోగపడుతోందన్న ఆయన.. ఆసరా పెన్షన్ తో అవ్వతాతలకు కేసీఆర్ ఆత్మ గౌరవం పెంచారని వ్యాఖ్యానించారు.
పెళ్లి అయితే కళ్యాణలక్ష్మి, గర్భిణీలకు నూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని తెలిపారు సిద్దిపేట మొత్తం తన కుటుంబమేనన్న హరీశ్.. వారికి సేవ చేయడమే తన బాధ్యత అని తెలిపారు. ఎవరికీ ఏ బాధ వచ్చినా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.