ఆర్టీసీ (RTC)ని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ఆపేందుకు గవర్నర్ (Governor) ప్రయత్నించారని, కానీ అది సాధ్యం కాలేదని మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. ఇక నుంచి ఆర్టీసీలో పని చేసే వారు కార్మికులు కాదని, ఉద్యోగులని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పనిగట్టుకుని బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నాయని, ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్ట్ మీద బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేయడం ఎంత వరకు న్యాయమని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించింది సీఎం కేసీఆరేనని, శాశ్వత కరువును రూపుమాపే ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకం, దీని పట్ల ప్రజలంతా సంతోషంతో ఉన్నారని హరీష్ రావు చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి మంచి పనిని అడ్డుకుంటున్నాయని, ప్రజలు పనివంతులైన బీఆర్ఎస్ పార్టీ కావాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో నోబుల్స్ కు గ్లోబల్స్ కు మధ్య పోటీ జరుగుతుందని, ప్రజలు ఎప్పుడైనా నోబుల్స్ ను కోరుకుంటారని చెప్పారు.
లెక్కల పరంగా చూస్తే భారత దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో కొయ్యగూడెం, గోండుగూడెంలలో విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయన్నారు. నిరుపేదలను డాక్టర్లను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేకపోయిందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే ఏం చేయలేక పోతున్నారని, ఇక తెలంగాణాలో ఏం చేయగలరని విమర్శించారు.