హర్యానా (Haryana)లో కల్తీ మద్యం (Spurious Liqour) కాటు వేసింది. తాజాగా కల్తీ మద్యం తాగి మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కల్తీ మద్యం మృతుల సంఖ్య 12కు చేరినట్టు అధికారులు తెలిపారు. మృతులు పూస్ ఘర్, మందే బరి, పంజేటో కి మజ్రా, యమునా నగర్‌లోని శరణ్ గ్రామానికి చెందిన వారిగా అధికారులు పేర్కొన్నారు.
మృతుల్లో యూపీకి చెందిన ఇద్దరు వలస కూలీలు ఉన్నట్టు వెల్లడించారు. అంబాలలో కల్తీ మద్యం సేవించిన తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ ను పోలీసులు ఏర్పాటు చేశారు.
మొదట యమునానగర్ జిల్లాలోని మండేబరి గ్రామంలో కల్తీ మద్యం మరణాలు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. సోమ, బుధవారం నాడు కల్తీ మద్యం తాగి మొత్తం ఏడుగురు మరణించారు. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతులకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఆస్పత్రిలో ఓ వ్యక్తి మరణంపై అనుమానాలు రావడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురుని పోలీసులు విచారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కల్తీ మద్యంపై పోలీసులు దాడులు చేస్తున్నారు.