ఓ ప్రియురాలు పిజ్జా(Pizza) అడిగింది. ఆమె కోరినట్టుగానే ఆ రెక్కలు కట్టుకుని పిజ్జాతో వాలిపోయాడా ప్రేమికుడు. నిజానికి పిజ్జా వారు కలిసి కబుర్లు చెప్పుకోడానికి పిజ్జా అనేది ఓ కారణం మాత్రమే.!
ఓ వైపు తెచ్చిన పిజ్జా చల్లారిపోతుంది. మరో వైపు సమయం ఐస్ క్రీములా కరిగిపోతుంది.ఇంతలో అనుకోకుండా ఆ అమ్మాయి తండ్రి వచ్చాడు. దీంతో ఆ యువకుడికి ఏం చెయ్యాలో తోచలేదు.
ఆ అమ్మాయి అయితే తలవాల్చకుని వాళ్ల నాన్నపక్క నుంచే సైలెంట్ గా లోపలికి వెళ్లిపోతుంది. పాపం ..! పిజ్జా ఇవ్వడం కోసం నాలుగో అంతస్తుదాకా వచ్చిన ఈ ప్రేమికుడు ఎలా వెళ్లాలి.?!
అమ్మాయి నాన్న రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక పోయాడు. కళ్లుముసుకుని వెనక్కి తిరిగాడు. నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు..!క్షణాల నిశ్శబ్ధం మరో క్షణంలో శబ్ధంగా మారిపోయింది.
హైదరాబాద్(Hyderabad)లోని బోరబండ(Borabanda)లో ఈ విషాదకర ఘటన జరిగింది. యువకుడి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
19 ఏళ్ల మహమ్మద్ షోయబ్ బోరబండలో ఉంటున్నాడు. అక్కడే ఓ బేకరీ(Bakery)లో ఉద్యోగం చేస్తున్నాడు..గత కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన యువతితో షోయబ్‌కు పరిచయం ఏర్పడింది.
వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచుగా మాట్లాడటం, కలవటం చేస్తుండేవారు. ఆమె కోరిందని ఆదివారం రాత్రి పిజ్జా తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు షోయబ్ . అదే టైంలో యువతి తండ్రి బయటికి రావడంతో కంగారు పడిపోయిన షోయబ్, తప్పించుకోవాలనే ఉద్దేశంతో నాలుగో అంతస్తు నుంచి దూకాడు.
తీవ్రంగా గాయపడిన షోయబ్‌ను స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. షోయబ్ ను గవర్నమెంటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షోయాబ్ సోమవారం చనిపోయాడు.పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. షోయబ్ తండ్రి ఫిర్యాదు మేరకు మిస్టీరియస్ డెత్‌గా పోలీసులు కేసు ఫైల్ చేశారు.