గంజాయి (Ganja) మత్తులో జోగుతోన్న యువత తమ భవిష్యత్తుని చేజేతులారా నాశనం చేసుకొంటున్నారు. మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ సమస్యలు సృష్టిస్తున్నారు.. మత్తు పదార్ధాల విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకొంటున్న మార్పు కనబడటం లేదు.
తాజాగా ములుగు (Mulugu) జిల్లాలో సుమారుగా రెండు కోట్ల విలువైన 757 కేజీల గంజాయిని పోలీసులు (Police) పట్టుకొన్నారు. ములుగు ఎస్పీ (SP) గాష్ ఆలం పర్యవేక్షణలో సుమారు రూ. 2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సంపాదనే ధ్యేయంగా కొందరు యువతకు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారని, వారిని అరికట్టడం కోసం పోలీసు అధికారులతో రహస్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా గంజాయి కేసులో 20 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని పోలీసులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని.. అక్రమ మద్యం, నగదు, గంజాయి స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.