బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణం వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో.. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
తెలంగాణలో రెండు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంటోంది వాతావరణశాఖ. కొన్నిచోట్ల ఈ రెండు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూలై నెలలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు కూడా నానా అవస్థలు పడ్డారు. కానీ, ఆగస్టులో మాత్రం వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని అంటోంది వాతావరణశాఖ. ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతోందని తెలిపారు అధికారులు. ఇటు ఏపీలోనూ భారీ వర్షాలు పడతాయని చెప్పారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు.