ఈ యేడాది ఎండలు ఎలా కాసాయో అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలు ఆ ఎండల్ని మర్చిపోయేలా చేశాయి. ఒక్కరోజు ఎండకాస్తే బావుండు బతికిపోతాం అనిపించాయి.!
అయితే ఇప్పటి దాకా కామ్ గా ఉన్న వాతావరణం ఒక్క సారిగా ప్లేటు పిరాయించింది. హైదరాబాద్(Hyderabad)లో వర్షం సూర్యుడి కంటే ముందు లేచింది.ఇట్స్ మై టైమ్ అంటూ సూర్యుణ్ని పడుకోబెట్టింది.
ఆకాశం మేఘావృతమై చల్లగా మారింది. పలు చోట్ల వర్షం కురిసింది.వర్షం కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా ఉదయం పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లఖ్డీకపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, ఆర్.టి.సి. రోడ్డు, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్లో వర్షం కురుస్తోంది.
హబ్సిగూడ, రామాంతపూర్, ఉప్పల్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, దుండిగల్, బహదూర్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఆగస్టు 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉందని.. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని మేఘాలు కమ్ముకునే అవకాశాలున్నాయన్నారు.
ఆగస్టు 15 నుంచి తెలంగాణ( Telangana)తో పాటు ఉత్తరాంధ్ర(Uttara Andhra)లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా.
ఏపీ కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం(Bay of bengal) పై సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీనికి తోడు, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు( Tamilnadu) మీదుగా కొమోరిన్ ప్రాంతం(Comorin ) వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయన్నారు.
ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.