తమిళనాడు (Tamilnadu)ను వరుణుడు వణికిస్తున్నాడు. దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. తిరున్యవేలీతో పాటు ట్యూటీకోరన్, టెన్ కాశీ, కన్యాకుమారి జిల్లాలో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం అయింది. ట్యూటీ కోరన్ జిల్లాలోని తిరుచెందూరు ప్రాంతంలో గడిచిన 15 గంగల్లో 60 సెంమీ వర్షం కురిసింది. అదే సమయంలో కన్యాకుమారిలో 17.3 సెంమీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వం రంగ సంస్థలు మూత పడనున్నాయి. తిరున్యవేలీ, తూత్తుకూడి, కన్యాకుమారి జిల్లాల్లో పాపనాశం, పెరుంజని, పెచుపరాయి డ్యామ్ ల నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరుకున్నాయి.
ఆయా ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న సహాయకచర్యలను పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాల (ఎన్డీఆర్ఎఫ్)తిరున్యవేలి ప్రాంతానికి చేరుకున్నాయి. రాష్ట్రవిపత్తు దళాలకు చెందిన మూడు బృందాలను కన్యాకుమారి ప్రాంతంలో మోహరించినట్టు అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 4000 మంది పోలీసులను మోహరించినట్టు తెలిపారు.