ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) లో ఆకస్మిక వరదలు (Heavy Rains) ముంచెత్తాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగింది. దీంతో ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతమంతా అతలాకుతం అయింది. తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. నది తీర ప్రాంతంలో విధుల్లో ఉన్న 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయినట్లు (23 Army Personnel Missing) రక్షణశాఖ ప్రకటించింది. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
చుంగ్తాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైందని, దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగిందని సిక్కిం ప్రభుత్వ అధికారులు తెలిపారు. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇందులో ఉన్న ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారని ఈస్ట్రన్ కమాండ్ ప్రకటించింది.
వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరద లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా నష్టం కలిగించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. తీస్తా నది సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.
సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నదికి దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. పశ్చిమ బెంగాల్‌ను సిక్కింను కలిపే జాతీయ రహదారి కూడా చాలా చోట్ల కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు మూతపడ్డాయి. మరో వైపు పశ్చిమ బెంగాల్‌లోని పరిపాలన యంత్రాగం ముందు జాగ్రత్త చర్యగా నది దిగువ పరివాహక ప్రాంతం నుండి ప్రజలను తరలిస్తున్నారు.