దేశంలో ఎన్నికల పండగ మొదలైంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections)తో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్నాయి.ఇప్పటికే మొదటిదశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తన రాజకీయ ఎంట్రీపై తమిళ నటుడు విశాల్ (Hero Vishal) కీలక వ్యాఖ్యలు చేశారు.
2026 తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కొత్త పార్టీని స్థాపించి ఎలక్షన్‌లో బరిలో దిగుతానని ప్రకటించారు. అయితే, తాను సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నానో విశాల్ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీస్ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం లేదని.. అలా చేస్తే తన లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఉండదన్నారు.
ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ప్రజలకు మంచి చేస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు నిత్యం ఉపయోగపడే వసతులను సైతం పూర్తి స్థాయిలో ఏ పార్టీ కల్పించడం లేదని అసహనం వ్యక్తం చేశాడు.
అధికారంలో ఏ పార్టీ ఉన్న తనకు సంబంధం లేదని ప్రజలకు మంచిని అందిస్తే చాలన్నారు. రాజకీయ పార్టీల విధివిధానాలు నచ్చకే రాజకీయ రంగప్రవేశం చేసేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.
హీరో విశాల్ కంటే ముందు తమిళ సూపర్ స్టార్ విజయ్ తళపతి కూడా కొత్త పార్టీని స్థాపించి 2026 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.