స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది. అయితే.. ఆయనకు హైకోర్టు (High Court) లో భారీ ఊరట లభించింది. గురువారం ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్ పై ఉన్న స్కిల్ కేసును క్లోజ్ చేసింది న్యాయస్థానం. దీంతో లోకేష్ కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయ్యింది.
ఈ కేసులో లోకేష్ ను నిందితుడిగా తాము చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41 ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానం కేసును డిస్పోజ్ చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. దీంతో నారా లోకేష్ కు భారీ ఊరట లభించింది.
ఈ తీర్పుపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా, అక్రమంగా కేసులు బనాయించవచ్చు కానీ.. న్యాయస్థానాల్లో న్యాయమే జరుగుతుందని తెలిపారు. ఇది జగన్ కు షాకేనని చెబుతున్నారు. త్వరలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా శుభవార్త రావాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక్క లోకేష్ విషయంలోనే కాదు.. చంద్రబాబుకు కూడా త్వరలోనే బిగ్ రిలీఫ్ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఏసీబీ కోర్టు తన బెయిల్ పిటిషన్ కొట్టేయగా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అంగళ్లు కేసులో వేసిన పిటిషన్ పైనా గురువారం విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.