– ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు
– టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై..
– హైకోర్టు న్యాయవాది సంచలన ఆరోపణలు
– గవర్నర్, సీఎం, ఏసీబీలకు ఆధారాలతో ఫిర్యాదు
– ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి
– తనది క్లీన్ రికార్డ్ అంటూ వివరణ
– తప్పుడు ప్రచారం చేస్తే దావా వేస్తానని వార్నింగ్
మాజీ డీజీపీ, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి (Mahender Reddy)పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పోలీసు శాఖలో పని చేస్తున్న సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ (Rapolu Bhaskar) సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మహేందర్ రెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
హైదరాబాద్ తో పాటు, నగర శివార్లలో అత్యంత ఖరీదైన భూములను తన బినామీలు, కుటుంబ సభ్యుల పేరిట కూడ బెట్టారని అన్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
ఈ ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. మొత్తం 14 పేజీల రిపోర్టును రాపోల్ భాస్కర్ రెడీ చేశారు. అందులో మహేందర్ రెడ్డి అక్రమాల చిట్టాను పొందుపరిచారు. దివంగత సినీ నటి సౌందర్యకు చెందిన వట్టినాగుల పల్లిలోని భూమిని ఆమె సోదరుడి వేలి ముద్రలను ఫోర్జరీ చేసి ఆ భూమిని మరో వ్యక్తికి సేల్ డీడ్ చేయించారని ఆరోపణలు చేశారు.
అంతే కాకుండా గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో సీసీఎస్ నూతన భవనం విషయంలో రూ.8 కోట్ల నిర్మాణ ఖర్చుకు బదులుగా రూ.16 కోట్ల ఖర్చును చూపించి ప్రభుత్వ సొమ్మును దండుకున్నారని వెల్లడించారు. భూ కబ్జాలకు పాల్పడే వారికి ఆయన సపోర్టు చేశారని, ఎన్నో భూములను తన పేరు మీదకు వాటా రాయించుకున్నారని చెప్పారు.
ఇలా మహేదందర్ రెడ్డి 40 వరకు అక్రమార్జనాలు చేశారని, వాటికి సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల పోలీసు అధికారులను తన అక్రమ పనులకు వాడుకునేవారని ఆరోపించారు.
మరోవైపు, అవినీతి ఆరోపణలపై మహేందర్ రెడ్డి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు.. నిరాధారమైనవని చెప్పుకొచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న.. సర్క్యులేట్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దాఖలు చేస్తానని హెచ్చరించారు. తాను 36 ఏళ్లకు పైగా ఎలాంటి కలంకం లేకుండా అంకిత భావంతో విధులు నిర్వహించానని మహేందర్ రెడ్డి తెలిపారు.
తన కెరీర్ మొత్తంలో క్లీన్ రికార్డ్ తో పాటు మంచి పేరును సంపాదించానని వివరణ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.