దేశంలోకి ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. కానీ, ఎంట్రీ ఇచ్చాక మాత్రం చాలా రాష్ట్రాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. కొద్ది రోజులు ఏకధాటిగా కురిసిన వానలకు (Monsoon Rains) జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రభుత్వాలు విద్యాలయాలకు సెలవులు, ఆఫీసులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణ (Telangana)లోనూ వానలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక జిల్లాల్లో వరదలు (Floods) ముంచెత్తి లోతట్టు గ్రామాలు (Villages) మునిగిపోయాయి. వరద నీటితో జనం అల్లాడిపోయారు.
ఓవైపు వర్షాలు, వరదలతో జనం చస్తుంటే.. ఇంకోవైపు కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలు సీఎం కేసీఆర్ (CM KCR) ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం ప్రగతి భవన్ దాటడం లేదని.. సచివాలయంలో సమీక్షలతోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. వరదలపై అంచనా కోసం కేంద్ర బృందం సైతం రాష్ట్రానికి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది. బాధితులను కలిసి వివరాలు సేకరించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సహాయక కార్యక్రమాలు, పరిహారం అంశంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు చేశారు విపక్ష నేతలు. ఇదే క్రమంలో వివాదం హైకోర్టుకు చేరింది.
రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన న్యాయస్థానం.. తమకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఆదేశించింది. శుక్రవారం మరోసారి దీనిపై విచారణ జరిపింది హైకోర్టు. రెండోసారి నివేదికను అందజేసింది ప్రభుత్వం. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు రిపోర్ట్ లో పేర్కొంది. అలాగే, రూ.500 కోట్లను పునరావాసం కోసం కేటాయించినట్లు వివరించింది.
అయితే.. రెండోసారి ప్రభుత్వం దాఖలు చేసిన ఈ నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరుఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మెమోను కోర్టుకి సమర్పించారు. ఇరు వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. రూ.500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని తెలిపింది. అలాగే, ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని మరోసారి ఆదేశించింది. అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని.. చనిపోయిన 49 మంది కుటుంబాలకు ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్రంగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.