గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ (MLC)లుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండ రాం (Professor Kodandaram), అమీర్ అలీఖాన్ (Amer Alikhan)ల ప్రమాణ స్వీకారానికి వరుసగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్సీలు సోమవారమే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా వాయిదా పడింది.
మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో నిన్న హైడ్రామా నడిచింది. చాలా సేపు ఎదురు చూసిన అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలు నిన్న నిరాశగా వెనుదిరిగారు. తాజాగా వారి ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది.
వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాలను నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాలకు బ్రేక్ పడింది. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతిపాదిలను ఆమోదిస్తూ వారిద్దరని ఎమ్మెల్సీలుగా గవర్నర్ నియమించారు. కానీ దీనిపై తాజాగా బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గత ఎమ్మెల్సీ విషయం తేలే వరకు ఎమ్మెల్సీ నియామకాలను ఆపాలని కోర్టును కోరారు.