– దేవాదాయ ఉద్యోగులు హిందూ ధర్మాన్ని పాటించాల్సిందే
– స్పష్టం చేసిన న్యాయస్థానం
– హైకోర్టు తీర్పుపై హిందూ సంఘాల హర్షం
శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి తొలగింపు విషయంలో ఈవో తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది. హిందూ ధర్మ సంప్రదాయాలు పాటించని ఉద్యోగులను తొలగించే అధికారం దేవాదాయ డిప్యూటీ కమిషనర్, శ్రీశైలం దేవస్థానం ఈవోకు ఉందని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 16(5) నిబంధన, ఏపీ చారిటబుల్ ట్రస్టు, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ ఆఫీస్ హోల్డర్స్ సర్వెంట్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం.. హిందూ ధర్మాన్ని ఆచరించని ఉద్యోగులపై వేటు వేసే అధికారం ఉన్నతాధికారులకు ఉందని స్పష్టం చేసింది.
పి. సుదర్శన్ బాబు అనే వ్యక్తి కారుణ్య నియామకం కింద 2002లో శ్రీశైలం దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్ గా చేరాడు. 2010లో ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలోని కెథడ్రల్ పాస్టోరేట్ చర్చిలో ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దేవస్థానం ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టే సమయంలో సుదర్శన్ బాబు తన మతం గురించి వెల్లడించకుండా వివరాలను గోప్యంగా ఉంచాడంటూ లోకాయుక్తలో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన లోకాయుక్త దీనిపై నివేదిక అందించాలని ఈవోను ఆదేశించింది. అతనిపై ఆరోపణలు నిజమని తేలడంతో సుదర్శన్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై 2012లో హైకోర్టులో సవాల్ చేశాడు సుదర్శన్.
తాను క్రైస్తవ యువతిని వివాహం చేసుకున్నంత మాత్రాన మతం మారినట్టు కాదని, అందువల్ల తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. దీనిపై తాజాగా విచారణ జరగగా.. చర్చిలోని మ్యారేజీ రిజిష్టర్ లో సుదర్శన్ సంతకం చేశాడని న్యాయమూర్తి వెల్లడించారు. వివాహం క్రైస్తవ సాంప్రదాయంలో జరుగుతున్నట్టు పిటిషనర్ కు పూర్తి అవగాహన ఉందన్నారు. విచారణ సమయంలో కోర్టు ముందు గానీ, అధికారుల ముందుగానీ తన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించలేదని తెలిపారు. అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టి వేస్తున్నట్టు స్పష్టం చేశారు.
దేవస్థానం ఉద్యోగుల విషయంలో సర్వీసు నిబంధనలు రూపొందించే అధికారం ఈవోకు ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది. నిబంధన-3 ప్రకారం దేవదాయ శాఖ ఉద్యోగులు తప్పనిసరిగా హిందూ సంప్రదాయాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఒకవేళ ఏ ఉద్యోగైనా ఇతర మతంలోకి మారితే బాధ్యతల నుంచి తొలగించే అధికారం ఉన్నతాధికారులకు ఉందని పేర్కొంది. పిటిషనర్ సుదర్శన్ మతం మారకుండా క్రైస్తవ యువతిని వివాహం చేసుకున్నట్టు చెప్పారని తెలిపింది. అలాంటి సందర్భంలో ప్రత్యేక వివాహ చట్టం-1954 మేరకు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని ఆయన తీసుకుని ఉండాలని, కానీ ఆ పత్రాన్ని కోర్టుకు అందించలేదని అందుకే వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది హైకోర్టు.