కెనడా (Canada)లో భారత హైకమిషనర్ సంజీవ్ వర్మ (Sanjeev Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ కేసును ఓ సీనియర్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే దెబ్బ తీశాడని సంచలన ఆరోపణలు చేశారు.
కెనడాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ వర్మ మాట్లాడుతూ…. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను “భారత ఏజెంట్లు” హతమార్చారనే ఆరోపణలను రుజువు చేసేందుకు కెనడా సాక్ష్యాధారాలను సమర్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు దర్యాప్తు విషయంలో కెనడాకు సహాయం చేయడానికి భారత్‌కు నిర్దిష్టమైన ఎలాంటి సమాచారాన్ని ఆ దేశం అందించలేదన్నారు. ఈ కేసులో అసలైన సాక్ష్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. అసలు కేసు విచారణ ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు.
ఇప్పటికే కేసు దర్యాప్తు కళంకితంగా మారిందని ఆరోపించారు. ఈ కేసులో భారత్ లేదా భారతీయ ఏజెంట్లు ఉన్నారని చెప్పాలంటూ ఓ ఉన్నత స్థాయి యంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. అందుకే ఇలా భారత్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.