‘హలాల్’సర్టిఫైడ్ ఉత్పత్తులపై ఇటీవల యూపీ సర్కార్ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ‘హలాల్’ఉత్పత్తుల చట్ట బద్దతపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అటు హలాల్ ధ్రువీకరణ అనేది ఒక సమాంత వ్యవస్థ అని యూపీ సర్కార్ చెబుతోంది. ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించి ఇది ప్రజల్లో గందర గోళాన్ని సృష్టిస్తుందని యూపీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటు గల్ఫ్ దేశాల్లో మాదిరిగా మన దేశంలో హలాల్ ఉత్పత్తుల ధ్రువీకరణకు ఎలాంటి అధికారిక నియంత్రణ సంస్థ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ప్రజల మస్తిష్కంలో అనేక సందేహాలు మెదులుతున్నాయి. అసలు దేశంలో హలాల్ ధ్రువీకరణకు రెగ్యులేటరీ సంస్థనే లేనప్పుడు ‘హలాల్’ప్రోడక్ట్స్ పై వేస్తున్న సర్టిఫైడ్ ముద్ర ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే నిజమైతే ఇలా చెల్లుబాటు గాని ముద్రలతో విక్రయాలు చేస్తుంటే సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఎఫ్‌ఎస్ఎస్ఏఐకి సమాంతరంగా థర్డ్ పార్టీలు ఇలా ఇష్టారీతిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ పోతుంటే అటు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ లాంటి సంస్థలకు రాజ్యాంగ బద్ధత ఉందని, కానీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారం థర్డ్ పార్టీ సంస్థలకు ఏ రాజ్యాంగం ఇచ్చిందని అటు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రజారోగ్యం, రాజ్యాంగ సంబంధమైన విషయాల్లో న్యాయ స్థానాలు స్వచ్చందంగా జోక్యం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని అంటున్నాయి. మరి ఇక్కడ బహిరంగంగా నిబంధన ఉల్లంఘన జరగుతోందని, ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నాయి.
మరోవైపు హిందువుల్లో హలాల్ తినని వారు కూడా ఉన్నారని చెబుతున్నాయి. అలాంటి వారు అనుకోకుండా లేదా తెలియకుండానే ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. అందువల్ల సూపర్ మార్కెట్స్, దుకాణాల్లో ‘హలాల్’ఉత్పత్తులను విడిగా ప్రదర్శించేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశిస్తున్నాయి. తమ మతస్తుల మనోభావాలను కూడా గౌరవించాలి కదా అని నిలదీస్తున్నాయి.
ఇక ఢిల్లీకి చెందిన పలు సంస్థలు నకిలీ హలాల్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నాయని యూపీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆయా సంస్థలు ఇతర రాష్ట్రాలకు కూడా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాంటప్పుడు చర్యలు కేవలం ఒక యూపీ సర్కార్ ఎందుకు తీసుకోవాలి… కేంద్రం రంగంలోకి దిగి ఈ నకిలీ సర్టిఫికెట్ల కథ ఎందుకు తేల్చకూడదని అడుగుతున్నాయి.