హలాల్ మాంసం (Halal Meat)పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదని అన్నారు. ఒక్క వేటుతో జంతువులను వధించడం ద్వారా వచ్చే ఝట్కా మాంసాన్ని మాత్రమే భుజించాలని సూచించారు. ఈ మేరకు హిందువులంతా ప్రమాణం చేయాలని ఆయన కోరారు.
బిహార్లోని బెగూసరాయ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ…. హిందువులు తమ ఆహార ఆచారాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. హలాల్ మాంసాన్ని తినబోమని తన మద్దతుదారులు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. కేవలం హలాల్ మాంసాన్ని మాత్రమే తినే ముస్లింలను తాను అభినందిస్తున్నానన్నారు.
ఇప్పుడు హిందువులు కూడా తమ మతం పట్ల ఇలాంటి నిబద్దతను ప్రదర్శించాలని ఆయన సూచించారు. జంతువుల వధ విషయంలో హిందువులు అనుసరించే పద్దతి ఝట్కా అని తెలిపారు. హిందువులు జంతు బలి చేసినప్పుడల్లా వారు ఒకే వేటుతో జంతువును మరణించేలా చేస్తారని పేర్కొన్నారు. హిందవులు హలాల్ మాంసాన్ని తిని తమను తాము భ్రష్టు పట్టించుకోకూడదన్నారు.
హిందువులు ఎల్లప్పుడూ ఝట్కా మాంసాన్ని తినేందుకు కట్టుబడి ఉండాలని కోరారు. కబేళాలు, ఝట్కా మాంసాన్ని మాత్రమే విక్రయించే దుకాణాలు ఉండేలా కొత్త వ్యాపార నమూనా అవసరమని చెప్పారు. అంతకు ముందు గత నెలలో ఉత్తర ప్రదేశ్ లో మాదిరిగానే బిహార్ లోనూ హలాల్ మాంసం ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆయన కోరారు.