బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) వ్యాఖ్యలకు అద్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిందుస్థాన్ అంటే హిమాలయాలు, ఇందూ సాగరానికి మధ్య గల ప్రాంతమని వెల్లడించారు. దాన్నే హిందువుల భూమి అని కూడా అంటారని అన్నారు. అంతే కానీ హిందుస్థాన్ అంటే హిందీ భాషకు సంబంధిచిన భూమి కాదన్నారు.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన అనేది భారతదేశంలోని అన్ని భాషలు మాట్లాడే వారికి సంఖ్యతో సంబంధం లేకుండా సమాన హోదా ఇచ్చేందుకు ఉద్దేశించినదని తెలిపారు. దేశంలో గల భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని జేడీయూ నేత నితీశ్ కుమార్ ను సద్గురు కోరారు. ఈ మేరకు ఆయన నితీశ్ కుమార్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వారి స్వంత భాష, సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న అనేక రాష్ట్రాలు ఉన్నందున ఇటువంటి సామాన్యమైన ప్రకటనలను చేయవద్దని మిమ్మల్ని గౌరవంగా అభ్యర్థిస్తున్నాను అని నితీశ్ కుమార్ ను ఉద్దేశించి అన్నారు. అంతకు ముందు విపక్ష ఇండియా కూటమి సమావేశానికి హాజరైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హిందీలో ప్రసంగించారు.
డీఎంకేకు చెందిన టీఆర్ బాలుకు నితీశ్ కుమార్ ప్రసంగం అర్థం కాలేదు. అందువల్ల దాన్ని ట్రాన్స్ లేట్ చేయాలని టీఆర్ బాలు కోరారు. ఈ క్రమంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఆ ప్రసంగాన్ని ట్రాన్స్ లేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని నితీశ్ కుమార్ తిరస్కరించారు. మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తామని నితీశ్ అన్నారు. హిందీ మన జాతీయ భాష అని, మనకు ఆ భాష తెలియాలన్నారు.