అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే చాలు టికెట్ల పంచాయితీ మొదలవుతుంది. ప్రతి పార్టీలోనూ టికెట్ తమ కంటే తమకు కావాలని నేతలు పోటీ పడుతుంటారు. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతారు. ఇంకొందరైతే… ఇదంతా కాదు గానీ ఓ పది కోట్లు పోయినా పర్వాలేదు గానీ టికెటు మాత్రం మాకే రావాలని ప్రయత్నాలు చేస్తారు.
అలాంటి ఓ వ్యాపారి ఆశను ఆసరాగా చేసుకున్న ఓ టీవీ మాజీ యాంకర్ ఒకరు అతని నుంచి కోట్లు దండుకున్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ ఆశ జూపి రూ. 5 కోట్లు దండుకున్నారు. తీరా మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యాపారి పోటీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆ మాజీ యాంకర్ ను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం….
టీవీ మాజీ యాంకర్ చైత్ర కుందపురా తన ప్రసంగాలతో కర్ణాటకలో చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత భజరంగ్ దళ్, వీహెచ్ పీ లాంటి హిందుత్వ సంస్థ సభల్లో వక్తగా ప్రసంగిస్తూ ఉండే వారు. ఏబీవీపీతో కూడా గతంలో ఆమెకు సంబంధాలు వున్నాయి. ఇది ఇలా వుంటే గోవింద బాబు పూజారి అనే వ్యాపార వేత్త ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉడిపి జిల్లా బైందూరు నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.
టికెట్ కోసం పలు పార్టీలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న చైత్ర తన బృందంతో కలిసి ఆ వ్యాపారిని కలుసుకున్నారు. బైందూరులో బీజేపీ నుంచి టికెట్ ఇప్పిస్తామంటూ ఆయన దగ్గర గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మే వరకు పలు దఫాల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో చైత్ర బృందంపై వ్యాపారికి అనుమానం పెరిగింది.
ఈ నేపథ్యంలో డబ్బుల గురించి చైత్రను ఆ వ్యాపారి ప్రశ్నించారు. దీంతో ఆ డబ్బులు అన్నీ విశ్వనాథ్ అనే ఆర్ఎస్ఎస్ నేత దగ్గర ఉన్నట్టు చైత్ర బదులు ఇచ్చింది. ఆ తర్వాత రమేశ్ అనే మరో వ్యక్తిని ఆర్ఎస్ఎస్ నేత విశ్వనాథ్ గా ఆ వ్యాపారికి పరిచయం చేశారు. అనుమానం పెరగడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఆ వ్యాపారిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశారు.
స్వామీజి అభినవ హల శ్రీకి డబ్బులు ఇవ్వాలని విశ్వనాథ్ చెప్పారని అనడంతో ఆ సాధువుకు తాను రూ. 1.5 కోట్లు ఇచ్చినట్టు ఆ వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు నిందితులకు రూ. 3.5 కోట్లను అందజేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు చైత్రతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.