చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) కు లోక్ సభ (Loke Sabha) లో ఆమోదం లభించింది. ఈ బిల్లుపై సుదీర్ఘంగా 8 గంటల పాటు ఈ రోజు చర్చించారు. బిల్లుపై పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి. బిల్లుకు మద్దతిస్తున్నట్టు దాదాపు అన్ని పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 456 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
అందులో బిల్లుకు అనుకూలంగా 454 మంది ఓటు వేశారు. మరో ఇద్దరు ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు మాత్రం బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లుకు రాజ్య సభలో ఆమోదం లభించాల్సి వుంది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత మహిళకు రిజర్వేషన్ కోటా అమలులోకి రానుంది.
ఈ బిల్లును అమలు చేసేందుకు జనగణను నిర్వహించనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం డీ లిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుందని చెప్పారు. బిల్లు అమలు విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఎన్నికల కమిషన్ కు చెందిన అధికారి ఒకరు, ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక ప్రతినిధి చొప్పున డీ లిమిటేషన్ కమిషన్ లో వుంటారని అమిత్ షా పేర్కొన్నారు. ఈ బిల్లు దేశంలో నిర్ణయాధికారం, విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. మహిళా బిల్లును ఇప్పటి వరకు పార్లమెంట్ లో ఐదు సార్లు ప్రవేశ పెట్టారని చెప్పారు.