ధైర్య సాహసాలకు పెట్టింది పేరు మేవాడ్ (Mewad) సామ్రాజ్యం. మేవాడ్ పేరు చెప్పగానే అందరికీ చటుక్కున ఆ ప్రాంత పాలకుడు మహా రాణా ప్రతాప్ (Maha Rana Pratap) పేరు గుర్తుకు వస్తుంది. ఆ సామ్రాజ్యంలో ఆయన్ని మించిన యోధుడు, గొప్ప వీరుడు బప్పా రావల్ (Bappa Rawal) గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అసలు మేవార్ గహిల్ రాజవంశ స్థాపకుడు ఆయనేనని చరిత్ర చెబుతోంది.
భారత్‌లో ఇస్లాం రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మహ్మద్ బిన్ ఖాసిమ్. 738-39 నాటికి ఉమయ్యద్ కాలిఫేట్ నాయకత్వంలోని మహ్మద్ బిన్ ఖాసిమ్ సేనలు పలు ప్రాంతాలను ఆక్రమించాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సింధ్ పాలకులను ఓడించి విజయ గర్వంతో దూసుకు పోతున్నాయి. ఈ క్రమంలో ఆ బిన్ ఖాసిమ్ దృష్టి దక్షిణ భారత్ పై పడింది.
పోరాటాల పురిటి గడ్డ మేవాడ్ ను స్వాధీనం చేసుకునేందుకు బిన్ ఖాసీం సేనలు బయలు దేరాయి. విషయం తెలుసుకున్న మేవాడ్ బప్పా రావల్ బిన్ ఖాసిమ్ సేనలపైకి తన సైన్యంతో విరుచుకు పడ్డారు. బిన్ ఖాసిమ్ సేనలను ఊచ కోత కోసి అప్ఝనిస్తాన్ లోని గజని ప్రాంత సరిహద్దుల వరకు తరిమి కొట్టాడు. అప్ఘనిస్తాన్ పై ఆధిపత్యాన్ని సంపాదించి అక్కడి కమాండర్ సలీమ్‌ను హత మార్చాడు. అనంతరం సలీమ్ మేనల్లుడిని గజనీ ప్రాంత పాలకుడిగా నియమించాడు.
ఇరాన్ వరకు ఉన్న శత్రు రాజ్యాలపై దండెత్తి ఆ ప్రాంతాలను హస్త గతం చేసుకున్నాడు. విజయ యాత్ర అనంతరం మేవాడ్ కు తిరిగి వస్తూ ప్రతి వంద కిలో మీటర్లకు ఒకరు చొప్పున తన సామంతులను పాలకులుగా నియమించి వచ్చారు. బప్పా తన రాజ్య ఉత్తర-దక్షిణ సరిహద్దులను బలోపేతం చేసేందుకు రావల్పిండి (నేటి పాకిస్తాన్ లోని) నగరాన్ని నిర్మించాడు.
సింధ్, బలూచిస్తాన్, ఘజనీ, కాందహార్, ఖొరాసన్, తురాన్, ఇస్ఫహాన్, ఇరాన్‌లతో సహా పలు రాజ్యాలను గడగడలాడించాడు. దీంతో సుమారు నాలుగు దశాబ్దాల పాటు మేవాడ్ వైపు చూసేందుకు అరబ్బులు ధైర్యం కూడా చేయలేదు. ఆయన్ని హిందూ ఆక్రమణ దారుడిగా అరబ్బులు పిలిచే వారంటేనే ఆయన ఎంతటి యుద్ద వీరుడో మనకు అర్థం అవుతుంది.