Telugu News » Razakar : ఎవరీ రజాకార్లు..? ఎలా పుట్టుకొచ్చారు..?

Razakar : ఎవరీ రజాకార్లు..? ఎలా పుట్టుకొచ్చారు..?

హైదరాబాద్ రాష్ట్ర జనాభాలో 80 శాతం కంటే ఎక్కువ మంది హిందువులు ఉండేవారు. అయినా కూడా నిజాం అధికారంలో తక్కువమంది ఉన్న ముస్లింల ఆధిపత్యం కొనసాగింది.

by admin
History of Razakar

– రజాకార్ అంటే..
రాక్షసత్వానికి ప్రతీక

– రజాకార్ అంటే..
మానవ రక్తాన్ని తాగిన రాకాసి మూక

– పేరుకే స్వచ్ఛంద సేవకులు
ప్రజలను పీడించడంలో రాక్షసులు

– జనం ధన, మాన, ప్రాణాలే
వారి విలాసం

– వీళ్ల హింసకు చితికిపోయిన గ్రామాలెన్నో..
రక్త దాహానికి బలైన ప్రాణాలెన్నో!

జాలీ, దయ లేని రాక్షస మూకలా ప్రజలను పీడించిన రజాకార్ల (Razakar) దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ‘రజాకార్’ సినిమాపై వివాదం నేపథ్యంలో ఆనాటి అకృత్యాలను స్వాతంత్ర్య సమరయోధులు గుర్తు చేస్తున్నారు. రజాకార్ల పుట్టుకను, హిందువులపై జరిగిన దాడులను వివరిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ (Hyderabad) సంస్థానానికి మాత్రం నిజాం నుంచి విముక్తి రాలేదు. ఎక్కడా జాతీయ జెండా ఎగురవేయకూడదని హుకుం జారీ అయింది. కానీ, 1947 సెప్టెంబర్ 2న పరకాల (Parakala) లో పతావిష్కరణకు ఏర్పాట్లు చేశారు ప్రజలు. చుట్టుపక్కల 25 గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని నిజాం (Nizam) కాల్పులకు ఆదేశించాడు. రజాకార్లు, పోలీసులు జనంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కనిపించిన వారిని వెంటబడి నరికేశారు. పరకాల శవాల దిబ్బగా మారింది. ఈ ఘటనను మరో జలియన్ వాలా బాగ్ గా పిలుస్తుంటారు. ఇలా రజాకార్ల రాక్షసత్వానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని అంటున్నారు ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు.

History of Razakar

రజాకార్ అనే పేరు ఎలా వచ్చింది..?

నిజాం పాలనలో హైదరాబాద్‌ ప్రభుత్వ మత శాఖకు డైరెక్టర్‌ గా ఉన్న నవాబ్‌ సదర్‌ యార్‌ జంగ్‌ అధ్యక్షతన తోహెద్‌ మంజిల్‌ లో ఒక సమావేశం జరిగింది. ఇందులో చేసిన తీర్మానాన్ని అనుసరించి ‘ఇత్తెహాదుల్‌ జైనుల్‌ ముస్లిమీన్‌’ సంస్థ 1927 నవంబరు 9న స్థాపించారు. 1929లో జైనుల్‌ అనే పదాన్ని తొలగించి మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ గా మార్చారు. దీనికి మొదటి అధ్యక్షుడు నవాబ్‌ సదర్‌ యార్‌ జంగ్‌. ఈ సంస్థ మొదట్లో సాంస్కృతిక అంశాలకే పరిమితమైంది. 1938 వరకు నామమాత్రంగా పని చేసింది. తర్వాత ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణ కోసం పని చేయడం ప్రారంభించింది. 1939లో నవాబ్‌ బహదూర్‌ యార్‌ జంగ్‌ అధ్యక్షుడు అయ్యాక కార్యక్రమాల్లో వేగం పెరిగింది. ప్రతి ముస్లిం స్వయంగా ఒక రాజు అనే ‘ఆనల్‌ మాలిక్‌’ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ సంస్థ నిజాంను శాసించే స్థాయికి ఎదిగింది. 1940లో సయ్యద్‌ మహ్మద్‌ హసన్‌ సలహా మేరకు ఒక వాలంటీరు దళాన్ని ఏర్పాటు చేశారు. వీరినే రజాకార్లు అంటారు. రజాకార్లు అంటే ఉర్దూలో స్వచ్ఛంద సేవకులని అర్థం. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు ప్రైవేట్ ఆర్మీగా పని చేశారు రజాకార్లు. 1946లో మజ్లిస్‌ సంస్థకు ఖాసిమ్ రజ్వి అధ్యక్షుడయ్యాడు. ఇతని ఆధ్వర్యంలో సంస్థ తీవ్ర రూపం దాల్చింది. 1948 నాటికి నిజాం అధికారాన్ని హస్తగతం చేసుకుని, హైదరాబాద్‌ లో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్‌ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. 50 వేల మంది రజాకార్లను తయారు చేసి.. ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచుతానని శపథం చేశాడు. ఇదే సమయంలో స్వాతంత్ర్యం కోసం హైదరాబాద్ వాసులు పోరాటం ఉద్ధృతం చేశారు. దీంతో రజాకార్ల పాశవిక చర్యలకు అంతే లేకుండా పోయింది. ఖాసిమ్ రజ్వి నాయకత్వంలోని రజాకార్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. వారు చేయని దుష్టకృత్యం లేదని చెబుతున్నారు స్వాతంత్ర్య సమరయోధులు.

హిందువులే లక్ష్యంగా అకృత్యాలు

హైదరాబాద్ రాష్ట్ర జనాభాలో 80 శాతం కంటే ఎక్కువ మంది హిందువులు ఉండేవారు. అయినా కూడా నిజాం అధికారంలో తక్కువమంది ఉన్న ముస్లింల ఆధిపత్యం కొనసాగింది. 1948 మార్చి 31న ఇత్తెహాద్‌-ఉల్‌-ముస్లిమీన్‌ పార్టీ కార్యక్రమం దారుస్సలాంలో జరిగింది. ఈ సందర్భంగా కాశిం రజ్వీ ప్రసంగిస్తూ ‘‘హిందువులకు తమను తాము పాలించుకోవడం చేతకాదు. అసఫియా(ఆసఫ్‌ జాహి) జెండాను ఢిల్లీలోని ఎర్రకోటపై త్వరలో ఎగురవేస్తాం’’ అని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలు జాతీయ నాయకుల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. ఇదే సమయంలో రజాకార్ల ఆగడాలు మితిమీరాయి. రైళ్లపై దాడులకు తెగబడ్డారు. 1948, మే 22న మద్రాసు(చెన్నై) నుంచి బొంబాయి(ముంబై) వెళ్లే రైలుపై గంగాపుర్‌ స్టేషన్‌ వద్ద దాడి చేశారు. బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ ను దహనం చేశారు. ఆ గ్రామాన్ని లూటీ చేసి చాలామందిని తీవ్రంగా గాయపరిచారు. మోటుకొండూరు, మజ్రా సికిందర్‌ నగర్, చందనపల్లి, సోమవరం, వర్ధమానుకోట, పల్లెపహడ్, సూర్యాపేట ప్రాంతాల్లో రజాకార్లు ఇవే తరహా దాడులకు తెగబడ్డారు. గుండ్రాంపల్లిలో 21 మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. పాతర్ల పహాడ్, బెహ్‌రాం పల్లి, కూటిగల్లులోనూ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. 1948 ఆగస్టు 27న 1,200 మంది రజాకార్లు భారీ మందుగుండు సామాగ్రితో బైరాన్ ​పల్లి గ్రామాన్ని చుట్టుముట్టి దాడులకు తెగించారు. గ్రామం బయట శవాల చుట్టూ మహిళలను వివస్ర్తలను చేసి బతుకమ్మ ఆడించారు. వారి ఆగడాలను భరించలేక కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రికి రాత్రి జరిగిన ఈ ఘటనలో 25 మంది రజాకార్లు, 119 మంది బైరాన్​ పల్లి వాసులు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైనా.. మృతుల సంఖ్య 300కు పైనే ఉంటుందని అప్పటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రజలను చంపడం, దోచుకోవడం, మహిళలపై అఘాయిత్యాలు.. ఇలా, గ్రామాల్లో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ జనాన్ని రజాకార్లు పీడించారని వివరిస్తున్నారు స్వాతంత్ర్య సమరయోధులు.

మరోసారి తెరపైకి ఆనాటి అకృత్యాలు

ఒకప్పుడు తెలంగాణలో రజాకార్లు అంటే సామాన్య ప్రజలు భయపడిపోయేవారు. ఇప్పుడు పాలకులు, సోకాల్డ్‌ సెక్యులర్స్ ఉలిక్కి పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ దేశమైనా చరిత్రను తమ ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటుంది. చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవడంతో పాటు త్యాగధనులు, యోధుల నుంచి స్ఫూర్తిని పొందుతాం. ఒక మతం వారు నొచ్చుకుంటారని బ్రిటిష్‌ వారిపై జరిపిన స్వాతంత్ర్య సమర పోరాటాన్ని మన పిల్లలకు చెప్పకుండా ఉన్నామా? దేశ భక్తులను, సామాన్య పౌరులను పరాయి పాలకులు చిత్రహింసలు పెట్టిన తీరును దాచుకుంటున్నామా? మరి, రజాకార్‌ పేరు వినగానే భయపడిపోవడం, ఉలిక్కి పడటం ఎందుకు? ఇదే ప్రశ్నలతో ‘రజాకార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిజాం పాలనలోని హైదరాబాద్‌ సంస్థానంలో రజాకార్లు సాగించిన అకృత్యాలు, గ్రామాలపై దాడులు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, గృహ దహనాలు, మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించడం, కుటుంబ సభ్యుల ముందే చెరచడం, సామూహికంగా ఊచకోత, బలవంతంపు మత మార్పిడులు.. ఇలా రజాకార్ల ఆగడాలను వివరిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానంలోకి ప్రవేశించి నిజాం పాలన నుంచి, రజాకార్ల బారి నుంచి ప్రజలను విముక్తి చేసిన తీరును చూపిస్తోంది. అయితే.. దీనిపై వివాదం రాజుకుంది. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉందని కొందరు మాట్లాడుతున్నారు. అయితే.. హిందూ సంఘాల నేతలు, బీజేపీ నాయకులు దీన్ని ఖండిస్తున్నారు. 1948, సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ కు స్వాతంత్ర్యం వచ్చిన సందర్భగా వేడుకలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ చరిత్ర భావి తరాలకు తెలియకుండా దాచి పెట్టిన కుట్ర ఎవరిది? హైదరాబాద్‌ ప్రజలు జరిపిన స్వాతంత్ర్య సంగ్రామ పోరాటం పాఠ్య పుస్తకాల్లో చేర్చి మన పిల్లలకు ఎందుకు బోధించడం లేదు? అని నిలదీస్తున్నారు. అయినా, రజాకార్ల రాక్షసత్వాన్ని చూపిస్తే సామరస్య వాతావరణం ఎందుకు దెబ్బతింటుంది? మత ఘర్షణలు ఎందుకు చెలరేగుతాయి? ఇవన్నీ అర్థం లేని వాదనలు అని మండిపడుతున్నారు. రజాకార్ల చరిత్ర నేటి తరానికి తెలిస్తే భయం ఎందుకు? ఒక సినిమా నిజంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుందా? ఇదే నిజమైతే ఇప్పటికి ఎన్ని సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేశాయి? అని ప్రశ్నిస్తున్నారు.

You may also like

Leave a Comment