– బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
– అధికారంలోకి రాగానే ఏడాదికి 4 సిలిండర్లు ఫ్రీ
– మక్తల్, నారాయణపేటలో టెక్స్ టైల్ పార్క్
– మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖ
– కేసీఆర్ పాలన అవినీతిమయం
– ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదు
– బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా నిర్వహిస్తాం
– ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం
– మక్తల్ లో అమిత్ షా హామీ
బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఎప్పుడూ తమ వారసుల గురించే ఆలోచిస్తాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah). ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ లో బీజేపీ (BJP) బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని, రాష్ట్రంలో కేటీఆర్ (KTR) ను పదవిలో కూర్చోబెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. వాళ్లు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే చేరుతారని ఆరోపించారు. అందుకే, బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.
బీజేపీ అధికారంలోకి రాగానే మక్తల్, నారాయణపేటలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. అలాగే, మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవన్న ఆయన.. ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న తెలిపారు. ఎంఐఎంకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని.. బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు అమిత్ షా. మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే బీఆర్ఎస్ నేతల విధానంగా మారిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ను ఇంటికి పంపే సమయం వచ్చిందని అన్నారు. ఆయన ఇచ్చిన ఏ హామీ నేరవేర్చలేదని, దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. బీజేపీ అధికారంలోకి రాగానే అందరినీ జైలుకు పంపిస్తామన్నారు షా. తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని.. తెలంగాణ అభివృద్ధి తమతోనే సాధ్యమని చెప్పారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎప్పుడూ మజ్లిస్ చేతిలోనే ఉంటుందన్నారు. బీజేపీ గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాణపత్రిష్ట చేస్తారని తెలిపారు అమిత్ షా.