పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ(PM MODI) పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలను తెంచి చొరబాటుదారులకు పంచి పెడుతుందని ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో మోడీ వ్యాఖ్యానించారు.ఈ కామెంట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
దీంతో ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోడీ గత పదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. దాని గురించి చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతుందని ఆరోపిస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దేశ ప్రజల్లో ఇలా ద్వేషాన్ని పెంచుతారా? అని ప్రశ్నించారు.
మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రాలో జరిగిన అల్లర్లలో మీరెంత మంది మంగళ సూత్రాలు తెంచలేదు? ఇప్పుడు ప్రధానిగా ఉండి కూడా మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ దేశప్రజల్లో ప్రేమను నింపే మాటలు మాట్లాడుతుంటే.. మోడీ మాత్రం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, ఇలా ముస్లింలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్ షర్మిల హితవు పలికారు.