విశాఖ ఫిషింగ్ హార్బర్లో (Vishaka Fishing Harbour) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 బోట్లు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రూ. 30 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా చేసిన పని అని స్థానిక మత్య్సకారులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెరెైన్ బోట్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. బోటు సిబ్బంది మంటల్లో చిక్కుకుని ఉంటారని మొదట అనుమానించారు. కానీ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు సీనియర్ పోలీసు అధికారి ఆనంద రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి బోటులోని సిలిండర్లే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. మంటలను ఫైర్ ఇంజన్లు అదుపులోకి తెచ్చాయన్నారు.
ఘటనకు గల కారణాలపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్దారణకు రాలేదన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అగ్ని ప్రమాదంలో బోట్లు కాలి బూడిద కావడంతో బోటు యజమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.