అందంగా కనబడాలని ఎవరికి ఉండదు.. అయితే సహజ సిద్దంగా వచ్చిన అందాన్ని కాదని.. కొందరు డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్లను కలసి మరింత సొగసులు అద్దుకోవాలని భావిస్తారు. అది సక్సెస్ అయితే ఫర్వాలేదు.. కానీ వికటిస్తే.. ఉన్న అందం కూడా పోయి అందహీనంగా మారడం ఖాయం. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి రావడం తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి అనుభవం ఒక నటికి ఎదురైంది.
తమిళనాడు (Tamil Nadu)కు చెందిన సినీనటి లతీఫా (Latifah) గత కొన్ని సంవత్సరాలుగా కేపీహెచ్‌బీ (KPHB) కాలనీలో నివాసం ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ధరణి ప్రొడక్షన్లో వచ్చిన మిస్టర్ సోల్జర్ మూవీలో నటించింది. ఆ తర్వాత వచ్చిన మరో ప్రాజెక్ట్‌లో మరింత అందంగా కనిపించాలని. కేపీహెచ్‌బీ కాలనీలోని లేయర్స్ కాస్మోటిక్ క్లినిక్ (Layers Cosmetic Clinic)ని సంప్రదించింది. ఆ ట్రీట్ మెంట్ కాస్త వికటించి అందహీనంగా మారింది.
ఈ క్రమంలో ఫిబ్రవరి 15వ తేదిన ముఖానికి సంబంధించిన బొటెక్స్, ఫిల్లర్స్ వంటి కాస్మోటిక్ ట్రిట్మెంట్చేయించుకొన్నట్లు లతీఫా తెలిపారు. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులకు చెంపలపై అందంగా కనిపించే సొట్ట బుగ్గులు మాయమయ్యాయని, ఆహారం తీసుకోవడానికి నోరు తెరవాలన్న నోరు తెరుచుకోకుండా విపరీతమైన నొప్పి అవుతండటంతో లతీఫా లేయర్స్ క్లినిక్ వైద్యులను సంప్రదించినట్లు తెలిపారు..
దీంతో తాను ఒప్పుకున్న సినిమాలో అవకాశం కోల్పోయినట్లు నటి వాపోయారు. లేయర్స్వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తనకు శారీరక సమస్యతో పాటు, తన కెరీర్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. తాను మరో వైద్యురాలి వద్దకు వెళితే, పిల్లర్స్వైద్యం చేసే క్రమంలో మరింత నిర్లక్ష్యం చేసి ఉంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉండేదని తెలిపిండన్నారు. కాగా తన ప్రాణాలతో చెలగాటం ఆడిన లేయర్స్ కాస్మెటిక్ క్లినిక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సినీ నటి డిమాండ్ చేశారు.
తనకు వైద్యం అందించిన డాక్టర్కౌముది డెంటిస్ట్ అయ్యుండి తనను తాను డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్గా చెప్పుకుని వైద్యం అందించినట్లు ఆరోపించారు. మరోవైపు ఈ సమస్యకు వైద్యం అందించి ఆమె ముఖంలో వచ్చిన మార్పులను సరి చేసేందుకు కృషి చేస్తామని లేయర్స్ మేనేజింగ్ పార్ట్నర్ విశ్వజిత్ తెలిపారు. ప్రజా ఆదరణ ఉన్న సంస్థ మీద అన్యాయంగా అభాండాలు వేయడం సరికాదని పేర్కొన్నారు..