హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ – 59 (Super Saver-59) ఆఫర్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న ఈ ఆఫర్ 2024 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ ను పొందేందుకు ప్రయాణికులు తాము గతంలో కొనుగోలు చేసిన మెట్రో హాలీడే కార్డు (Holiday Card) ను ఉపయోగించవచ్చు, లేదా కొత్తగా మెట్రో హాలీడే కార్డును కొనుగోలు చేయవచ్చు.
ఈ ఆఫర్ ను పొందేందుకు మెట్రో స్టేషన్ లోని ప్రకటించిన సెలవు జాబితాను అనుసరించి సూపర్ సేవర్ హాలీడేస్ లో కేవలం రూ.59 లకే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎల్ అండ్ టీ మెట్రో అధికారిక వెబ్ సైట్ ను, ఏదైనా మెట్రో స్టేషన్ లో సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ – 59 ఆఫర్ ని తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 23 సెప్టెంబర్ 2023 నుండి హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులందరూ లిస్టెడ్ సూపర్ సేవర్ సెలవు దినాలల్లో కేవలం రూ.59తో మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల ప్రయాణం సులువుగా… సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టింది. భక్తుల ప్రయాణానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. గణేష్ చతుర్ధికి అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించేలా మెట్రో రైలు సేవలు పెంచుతామని ప్రకటించింది. గణేష్ నవరాత్రుల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడపుతోంది. గతంలో మాదిరిగానే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. ఇక, ఖైరతాబాద్ స్టేషన్‌లో అదనపు టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.