ఉన్నతమైన భవిష్యత్తు ఆశించి కన్నవారిని, పుట్టిన ఊరును కాదని విదేశాలకు వెళ్ళి.. అక్కడ అనాధగా మరణిస్తున్న వారి గాధలు కన్నీరు తెప్పించక మానవు.. కొందరు ఉద్యోగాల కోసం వెళ్తే.. మరికొందరు ఉన్నత చదువుల కోసం సప్త సముద్రాలు దాటుతున్నారు. తమ కొడుకు ప్రయోజకుడై వస్తాడని ఎదురు చూసిన వారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన కెనడాలో చోటు చేసుకొంది.
విదేశాల్లో చదివి తన కలలు నెరవేర్చుకోవాలని కెనడా (Canada) వెళ్లిన హైదరాబాద్ (Hyderabad) విద్యార్థి ఆకస్మికంగా మరణించారు. నగరానికి చెందిన షేక్ ముజామ్మిల్ అహ్మద్ మాస్టర్స్ చదివేందుకు కెనడా వెళ్లాడు. అంటారియో (Ontario)లోని వాటర్లూ వర్సిటీ క్యాంపస్ లో ఐటీలో పీజీ చేస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు అహ్మద్ ఫోన్ లో చెప్పాడని అతని తల్లిదండ్రులు వివరించారు.
ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకొని, వైద్యులను సంప్రదించాలని సూచించినట్లు తెలిపారు. ఇంతలోనే కొడుకు స్నేహితుడి నుంచి అహ్మద్ చనిపోయాడంటూ ఫోన్ వచ్చిందన్నారు. జ్వరంతో బాధపడుతున్న అహ్మద్.. కార్డియాక్ అరెస్టు (Cardiac Arrest)కు గురయ్యాడని, దీంతో ప్రాణం పోయిందని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. కొడుకు మరణంతో కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు.. మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు.