అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరఫున పోటీ పడుతున్న వివేక్ రామ స్వామి (Vivek Rama Swamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక హిందువునని చెప్పారు. హిందు మత విశ్వాసమే తనకు ఫ్రీడమ్ ఇచ్చిందన్నారు. హిందు మతమే తనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ వైపు నడిపించిందన్నారు. నిజమైన దేవుడు ఒక్కడేనని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానని వెల్లడించారు.
ఫ్యామిలీ లీడర్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. దేవుడు ఒక్కడేనని తాను నమ్ముతానన్నారు. దేవుడు ప్రతి ఒక్కరినీ ఏదో ఒక ప్రత్యేక కారణం కోసం ఈ భూమిపైకి పంపించాడని తాను నమ్ముతానన్నారు. మనందరికీ ఓ ప్రత్యేకమైన కర్తవ్యం ఉందని హిందూ మతం మనకు బోధించిందన్నారు.
వివిధ మార్గాల్లో మన ద్వారా దేవుడు పలు రకాలు పనులు చేస్తుంటాడన్నారు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానన్నారు. తను హిందూ సంప్రదాయ కుటుంబంలో పుట్టానన్నారు. వివాహం బంధం, కుటుంబ విలువల గురించి తన తల్లిదండ్రులు తనకు నేర్పించారన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని ఆయన సూచించారు.
వివాహానికి ముందు సంయమనం పాటించాలని సూచించారు. వ్యభిచారం తప్పని చెప్పిన ఆయన విడాకుల విషయంలో ఆలోచించాలన్నారు. వివాహ భాగస్వామ్య విలువల కోసం తాను నిలబడతానని స్పష్టం చేశారు. తాను క్రిస్టియన్ హై స్కూల్ లో చదువుకున్నానన్నారు. అందువల్ల తాను బైబిల్ కూడా చదువుతానని చెప్పారు. మనుషులంతా ఒక్కటేనన్నారు.