ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విపక్ష ఇండియా కూటమి (India Alliance)లో లుక లుకలు మరోసారి బయట పడుతున్నాయి. తాజాగా ఫలితాల అనంతరం కాంగ్రెస్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ వైఖరే కారణమని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఇండియా కూటమి తదుపరి సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డుమ్మా కొడతారని తెలుస్తోంది.
ఇండియా కూటమి సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అందువల్ల ఉత్తర బెంగాల్‌లో ఓ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసుకున్నట్టు వెల్లడించారు. ఉత్తర బెంగాల్‌లో తాను వారం రోజుల పర్యటించనున్నట్టు తెలిపారు. ఇండియా కూటమి సమావేశం గురించి తనకు ముందే తెలిసి ఉండే తాను ఈ పర్యటనను ఫిక్స్ చేసుకుని ఉండే దాన్ని కాదన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో ఓటమి తర్వాత విపక్ష ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న పిలుపునిచ్చారు. డిసెంబర్ 6న ఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు మిత్ర పక్షాలతో మల్లికార్జున ఖర్గే ఫోన్‌లో మాట్లాడారు. ఇలా అకస్మాత్తుగా సమావేశం ఏర్పాటు చేయడంపై మమతా గుర్రుగా ఉన్నారు.
అంతకు ముందు కాంగ్రెస్ పై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ కేవలం తెలంగాణలో మాత్రం విజయం సాధించిందన్నారు. ఇండియా కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైందన్నారు. ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ముందుకు రాలేదన్నారు. 2024లో ఇండియా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే బీజేపీ అధికారంలోకి రాదన్నారు.