లోక్ సభ ఈ రోజు భారీ భద్రతా వైఫల్యం (Security Breach) కనిపించింది. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి కొందరు దుండగులు దూసుకు వెళ్లారు. వాళ్లను కొందరు ఎంపీలు ధైర్యంగా అడ్డుకున్నారు. దుండగులను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దుండగుల్లో ఓ వ్యక్తిని పట్టుకున్న కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా (Gurjeet Singh Aujla) అనంతరం ఆ గందర గోళ పరిస్థితి గురించి మీడియాకు వివరించారు.
సభలోకి చొరబడిన ఓ దుండగుడి చేతిలో ఏదో ఓ వస్తువు కనిపించిందని తెలిపారు. దాని నుంచి పసుపు రంగు పొగలు వెలుబడుతున్నాయని వెల్లడించారు. దీంతో వెంటనే ఆ వస్తువును లాక్కొని బయటకు విసిరి వేశానన్నారు. తర్వాత ఆ వ్యక్తిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించానన్నారు. ఇది చాలా పెద్ద భద్రతా ఉల్లంఘన అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఇప్పటికే కేంద్రం సీరియస్ అయింది. భద్రతా వైఫల్యంపై పోలీసులు దర్యాప్తు జరపుతున్నారు. ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో సాగర్ శర్మ అనే వ్యక్తి మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా విజిటర్ పాస్‌తో గ్యాలరీలోకి వచ్చాడని పోలీసులు గుర్తించారు. మరో నిందితున్ని మైసూర్‌కు చెందిన మనోరంజన్ డీగా గుర్తించారు
వారితో పాటు నిందితుల్లో హర్యానాకు చెందిన నీలమ్ (42) అనే మహిళ, మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే (25) ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ ప్రయోగించినట్టు అధికారులు తెలిపారు. భద్రతా పరమైన లోపాల నేపథ్యంలో విజిటర్స్ పాసులపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులను జారీ చేసే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని చెప్పారు. మరోవైపు అఖిలపక్ష సమావేశానికి లోక్ సభ స్పీకర్ పిలుపు నిచ్చారు. మరి కొద్ది సేపట్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.