పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి( Cm Revanth reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్రంలో బీజేపీ(BJP) మూడోసారి గెలిస్తే రిజర్వేషన్లు(Reservations) రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు వద్దు అనుకునే వారు బీజేపీకి.. కావాలనుకునే వారు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరెస్సెస్(RSS) భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమేనని చెప్పారు. 100 ఏళ్లలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరెస్సెస్ కంకణం కట్టుకుంది. తమకు మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభమని మోదీ అనుకుంటున్నాడని వెల్లడించారు.
ప్రధాని మోడీ దేశాన్ని మోసం చేశారని, డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. మోడీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు.
నల్లధనం తెస్తానన్న మోదీ పది పైసలు కూడా తీసుకురాలేదని, 55 రూపాయల పెట్రోల్ మోదీ వచ్చాక 110 అయ్యిందని ఎద్దేవాచేశారు.
జీఎస్టీ పేరుతో కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని, దేవుడి పేరు చెప్పే బీజేపీ అగరబత్తీలపై కూడా జీఎస్టీ వేసిందని మండిపడ్డారు. చిన్న పిల్లల పెన్సిల్,రబ్బర్ లపై కూడా జీఎస్టీ వేస్తున్నారని, 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే మోదీ ఒక్కడే డబుల్ అప్పులు చేశారన్నారు. పోర్టులు,ఎయిర్ పోర్టులు,రహదారులు ఇలా అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని దుయ్యబట్టారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని తప్పకుండా ఎక్స్ రే తీస్తామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాన్ని 50 శాతానికి పెంచుతామని బీజేపీ భయం పట్టుకున్నదని చెప్పారు. మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ ఉద్యమాన్ని తెచ్చిందన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. కొందరు స్థానిక రాజకీయాల కోసం రిజర్వేషన్లు తీసేయడానికి సిద్ధమైన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, రిజర్వేషన్లు కావాలా? వద్దా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు. రిజర్వేషన్లు ఉండాలి అనేవాళ్ళు కాంగ్రెస్‌కి,వద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయాలని సీఎం రేవంత్ సూచించారు.