ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్శిటీల జాబితాను క్వాక్వారెల్లి సైమండ్స్ (QS) సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా రెండో సారి భారత్‌లో అత్యుత్తమ యూనివర్శిటీగా ఐఐటీ బాంబే (IIT Bombay) నిలిచింది. ఈ ఏడాది జాబితాలో భారత్‌కు చెందిన 148 యూనివర్శిటీలు చోటు దక్కించుకున్నట్టు క్యూఎస్ వెల్లడించింది.
గతంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా భారత్ కు చెందిన మరో 37 వర్శిటీలకు ఈ జాబితాలో స్థానం లభించినట్టు పేర్కొంది. ఈ జాబితాలో అత్యధిక స్థానాలు పొందిన దేశాలు వరుసగా భారత్ (148), చైనా (133), జపాన్ (96)ఉన్నట్టు తెలిపింది. ఇది ఇలా వుంటే మయన్మార్, కంబోడియా, నేపాల్ లకు ఈ జాబితాలో తొలిసారి చోటు దొరికినట్టు పేర్కొంది.
టాప్-100 యూనివర్శిటీల జాబితాలో భారత్ నుంచి ఐఐటీ ఢిల్లీ(46), ఐఐటీ-మద్రాస్ (53), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(58), ఐఐటీ ఖరగ్ పూర్(59), ఐఐటీ కాన్పూర్-(63), యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ (94) ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 21 యూనివర్శిటీల ర్యాంకింగ్స్ మెరుగుపడగా, 15 యూనివర్శిటీల ర్యాకింగ్స్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తాజాగా ఈ ఏడాది 37 వర్శిటీలు కొత్తగా స్థానం సంపాదించుకున్నాయి. ఈ జాబితాలో చైనాకు చెందిన పెకింగ్ వర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ఉంది. మూడవ స్థానంలో చైనాలోని సింగ్వా వర్శిటీ, నాల్గవ స్థానంలో హంకాంగ్ వర్శిటీ, ఐదవ స్థానంలో నాన్ యంగ్ వర్శిటీ నిలిచింది.