దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు భారీ వర్షాలు(heavy rains) కురుస్తాయని భారత వాతావరణశాఖ (imd)ప్రకటించింది. యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీతో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వచ్చే ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురవవచ్చు. ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాల్లో రాగల నాలుగురోజుల పాటటు వర్షాలు కురవనున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొండచరియలు విరిగిపడటం, అనేక ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి.
యూపీలోని లక్నో, గోరఖ్ పూర్, బరేలీ, దేవిపటాన్, బస్తీ, ప్రయాగరాజ్, మురాదాబాద్, ఝాన్సీ, మీరట్, కాన్పూర్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోనూ రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రంలో 729 రోడ్లు దెబ్బతిన్నాయి. 2,897 పవర్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేదని ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. కొండచరియలు విరిగిపడి మండికి వెళ్లే రహదారిని అడ్డుకోవడంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రంలో 242 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి సుక్కు గురువారం ప్రకటించారు.
కులు-మండి హైవేపై కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్కు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. ఆగస్ట్ 29 వరకు ఈ వర్షపాతం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా శుక్రవారం సిమ్లాలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.