తెలంగాణ (Telanagna) లో ఈ వానాకాలం(Riny Season) 15 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
ఈ నెల 25 నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయని, రాజస్థాన్ నుంచి వెనుతిరుగుతాయని వెల్లడించింది. ఈ ప్రభావంతో డిసెంబర్ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు.
అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.