సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ (CM Stalin) కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం రేగుతోంది. తాజాగా ఆయన వ్యాఖ్యలపై అయోధ్య ధర్మ సంసాద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయ్ నిధి స్టాలిన్ వారంలోగా క్షమాపణలు అల్టిమేటం (Ultimatum) జారీ చేసింది. లేని పేక్షంలో తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించింది.
అయోధ్యలోని ఆచార్య పీఠ్ తపస్వీ క్యాంపులలో ధర్మ సంసాద్ ను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మంపై ఉదయ్ నిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ధర్మ సంసాద్ ప్రతినిధులు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలపై వారంలోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశంలోని హిందూ సంఘాల నాయకులు, ప్రజలతో కలిసి తమిళనాడు సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
సనాతన ధర్మంపై రెచ్చగొట్టే, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్న నేతలపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ నాయకులపై చర్యలు తీసుకోని పక్షంలో అవసరమైతే పార్లమెంట్ నూతన భవనాన్ని, రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్మసంసాద్ కు అధ్యక్షత వహించిన జగద్గురు పరమహంస మాట్లాడుతూ…..
సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రజలను అవమానించేలా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారే ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 120 కోట్ల మంది ప్రజలు సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలను వాళ్లు సహించబోరని తెలిపారు.