పాకిస్తాన్(Pakisthan)లో ఓ హిందూ మహిళ (Hindu Woman) ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. 2024 ఫిబ్రవరి8న నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కైబర్ ఫక్తుంక్వాలో బూనర్ జిల్లాకు చెందిన సవీరా ప్రకాశ్ (Saveera Prakash) అనే మహిళ నామినేషన్ వేశారు. బూనర్ జిల్లాలోని పీకే-25 అసెంబ్లీ స్థానం నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేసినట్టు పాక్ మీడియా వెల్లడించింది.
సవీరా ప్రకాశ్ ప్రస్తుతం డాక్టర్ గా పని చేస్తున్నారు. 2022లో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి వైద్య శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో బూనర్ జిల్లాలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా సవీరా పనిచేస్తున్నారు. ఆ పార్టీ తరఫున మహిళా సాధికారత, అభ్యున్నతి, మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేస్తున్నారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి ఆమె టికెట్ ఆశిస్తున్నారు. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ రిటైర్డ్ డాక్టర్. ఆయన గత 35 ఏండ్లుగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున సేవ చేస్తున్నారు. పాక్‌లో అభివృద్ధి ఫలాలు మహిళలకు అందడం లేదని, చారిత్రకంగా మహిళలు నిర్లక్ష్యానికి గురయ్యారని, మహిళలు పూర్తిగా అణచివేతకు గురవుతున్నారని సవీరా వెల్లడించారు.
రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకు పోరాటం చేస్తానని సవీరా అంటున్నారు. తాను కూడా తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని, అణగారిన వర్గాల హక్కుల కోసం అసెంబ్లీలో తన గొంతును వినిపిస్తానని చెప్పారు. నామినేషన్ వేసిన నేపథ్యంలో సవీరాకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ మద్దతు ఆమెకు ఉంటుందని హామీ ఇస్తున్నారు.