ఉత్తరాఖండ్‌లో సొరంగం (Tunnel)లో రెస్క్యూ ఆపరేషరేషన్ (Rescue Operation) కొనసాగుతోంది. తాజాగా కార్మికులను రక్షించేందుకు ఐదు ఎంపికల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈ ఐదు ప్రత్యామ్నాయాలపై ఐదు ప్రత్యేక ఏజెన్సీలు పని చేస్తాయని రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ వెల్లడించారు.
సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల విలువైన ప్రాణాలను రక్షించేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. నిపుణుల సలహా మేరకు వివిధ ఎంపికలను పరిశీలించిన తర్వాత ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
ఓఎన్‌జీసీ, ఎస్జీవీఎన్ఎల్, ఆర్‌వీఎన్ఎల్, ఎన్ హెచ్ఐడీసీఎల్, టీహెచ్ డీసీఎల్ లు ఈ పనులను నిర్వహిస్తాయని తెలిపారు. ఈ సంస్థలకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఆర్మీ సహాయ సహకారాలు అందిస్తాయన్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అప్రోచ్ రోడ్‌ను పూర్తి చేసిన తర్వాత కార్మికులకు అత్యవసరమైన వస్తువుల సరఫరా కోసం ఆర్వీఎన్ఎల్ మరొక వర్టికల్ పైప్‌లైన్ పనిని ప్రారంభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఎన్‌హెచ్ఐడీసీఎల్ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసిన తర్వాత సిల్క్యారా చివరి నుంచి డ్రిల్గింగ్‌ను కొనసాగిస్తుందన్నాయి. తెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్ డీసీ) బార్కోట్ నుండి మైక్రో టన్నెలింగ్‌పై పని చేస్తుందన్నాయి. దీని కోసం భారీ యంత్రాలను ఇప్పటికే సమీకరించారని చెప్పాయి.
సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎస్‌జేవీఎన్ఎల్) టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సొరంగం పై నుండి నిలువుగా డ్రిల్లింగ్ చేస్తుందని పేర్కొన్నాయి. ఇక డీప్ డ్రిల్లింగ్‌లో నైపుణ్యం ఉన్న ఓఎన్ జీసీ సంస్థ బార్కోట్ టన్నెల్ చివరి ప్రాంతం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ కోసం ఇప్పటికే పనులు కూడా ప్రారంభించిందని వెల్లడించాయి.