రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య (Ayodhya)కు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)ప్రకటించింది. ఈ నెల 30 నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు మొదలవుతాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడపడం అయోధ్య చరిత్రలో ఇదే మొదటి సారి అని సంస్థ వెల్లడించింది.
డిసెంబర్ 30న ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి ఐఎక్స్ 2789 విమానం బయలు దేరుతుందని తెలిపింది. మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐక్స్ విమానం చేరుకుంటుందని చెప్పింది. మరోవైపు అదే రోజు మధ్యాహ్నం 12:50 గంటలకు ఐఎక్స్ 1769 విమానం బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 2:10 గంటలకు ఆ విమానం ఢిల్లీ చేరుకుంటుందని తెలిపారు. ఈ మార్గంలో జనవరి 16 నుంచి ప్రయాణికులకు రోజూవారీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. విమానాశ్రయం ప్రారంభం అయిన తర్వాత అయోధ్య నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉత్సాహంగా ఉందని ఆ సంస్థ ఎండీ అలోక్ సింగ్ అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న టైర్ 2, టైర్ 3 నగరాల మధ్య కనెక్టివిటీని పెంపొందించే విషయంలో ఇది తమ నిబద్దతను తెలియజేస్తుందన్నారు. అయోధ్యలో జరగబోయే అభివృద్ధి గురించి తాము ఉత్సాహంగా ఉన్నామన్నారు. సమీప, సుదూర యాత్రికులు, ప్రయాణీకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ వృద్ధిలో తాము కూడా భాగమైనందుకు గర్విస్తున్నామన్నారు.