అయోధ్య రామ మందిర(Ayodya Ram Mandir)ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశ విదేశాల్లో సంబురాలు జరుపుకుంటున్నారు. తాజాగా వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు కార్ల ర్యాలీ (Car Rally) నిర్వహించారు. ఈ సందర్బంగా వాషింగ్టన్ వీధులు జై శ్రీ రాం నినాదాలతో మార్మోగి పోయాయి.
కారు ర్యాలీ సందర్భంగా ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ సమీపంలో ఉన్న అయోధ్య వేలో శ్రీ భక్త అంజనేయ ఆలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అమెరికా డీసీ ఛాప్టర్ మహేంద్ర సాపా మాట్లాడారు. 500 ఏండ్ల హిందువుల పోరాటం తర్వాత రామ మందిర నిర్మాణం జరుగుతోందని అన్నారు. అందుకే అమెరికాలోనూ సంబురాలు జరుపుకుంటున్నామని తెలిపారు.
జనవరి 20న అమెరికాలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. సుమారు 1000 మంది అమెరికన్ హిందూ కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయని తెలిపారు. ఈ వేడుకల్లో రామ్ లీలా, రాముడి కథలు, ప్రార్థనలు, భజనలు నిర్వహిస్తామని అన్నారు. అమెరికాలో జన్మించిన పిల్లలకు అర్థమయ్యేలా 45 నిమిషాలపాటు శ్రీరాముడి జీవితవిశేషాలను ప్రదర్శిస్తాంమని అని వెల్లడించారు.
అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాని మోడీతో యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 6వేల మంది అతిథులను ఆహ్వానించారు.