పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపుతున్నాయి. దేశంలో అతి పెద్ద వైర్లు, కేబుల్స్ తయారీ కంపెనీ పాలీక్యాబ్ (Poly Cab) పై దాడులు చేస్తోంది. పాలీ క్యాబ్ ఇండియా కంపెనీకి సంబంధించి మొత్తం 50 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు జరుపుతోంది. సంస్థతో సంబంధం ఉన్న మేనేజ్ మెంట్ అధికారుల నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.
పాలీ క్యాబ్ కంపెనీకి సంబంధించి దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పుణె, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, బరోడా (గుజరాత్), సికింద్రాబాద్ (తెలంగాణ), కోల్‌కతాలోని కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. దాడులకు గల కారణాలపై ఐటీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
దేశ వ్యాప్తంగా ఈ కంపెనీకి 23 తయారీ సౌకర్యాలు, 15 కంటే ఎక్కువ కార్యాలయాలు, 25కి పైగా గిడ్డంగులు ఉన్నాయి. దాడులకు గల కారణాలను ఐటీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ లో కంపెనీకి భారీ లాభాలు వచ్చినట్టు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కంపెనీకి సుమారు 59 శాతం లాభాలు రావడంతో రూ. 426 కోట్లుగా ఆదాయం వచ్చిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఐటీ దాడుల వార్తల నేపథ్యంలో పాలీ క్యాబ్ షేర్ల ధరలు స్వల్పంగా తగ్గాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో పాలీక్యాబ్ షేర్లు 2.4 శాతం తగ్గి రూ.5,483.95 వద్ద ట్రేడవుతున్నాయి. 2023లో ఇప్పటి వరకు ఈ స్టాక్ 100 శాతానికి పైగా పెరిగింది. దీంతో మదుపర్ల డబ్బు రెట్టింపు అయింది.