ప్రస్తుతం ఎలక్షన్ అంటే డబ్బుతో కూడిన వ్యవహారం. అనుచరుల్ని సంతోష పెట్టాలన్నా.. నాలుగు ఓట్లు రావాలన్నా కీ రోల్ మనీయే. ఎన్నికల సంఘం (Election Commission) ఎంత నిఘా పెట్టినా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతూనే ఉంటుంది. త్వరలో తెలంగాణ (Telagana) లో ఎన్నికలు జరగనున్నాయి. కోడ్ నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కోట్ల డబ్బు పోలీసులకు దొరుకుతోంది. ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు.
తెలంగాణ ఎన్నికల కోసం బెంగళూరు (Bengaluru) కేంద్రంగా డబ్బు సమకూరుతోందనే అనుమానాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఐటీ శాఖ దాడులకు దిగింది. గడిచిన వారం రోజులుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు, బడా వ్యాపారులు ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుపుతున్నారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు బెంగళూరు నుంచి ఫండింగ్ జరుగుతోందనే సమాచారంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలకు దిగారు.
మాజీ కార్పోరేటర్ సోదరుడి వద్ద రూ.42 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. అంతకుముందే మరో రూ.8 కోట్లను కర్ణాటక నుంచి తెలంగాణకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. హొస్కోటలోని బిర్యానీ సెంటర్లపైనా దాడులు నిర్వహిస్తున్నారు. ఓ హోటల్ యజమాని ఇంటిలో 30కి పైగా క్యూఆర్ కోడ్ స్కానర్ లను గుర్తించారు. ఓ హోటల్ యజమాని వద్ద రూ.1.47 కోట్ల నగదును పట్టుకున్నారు.
భారీగా నగదును సీజ్ చేసిన అనంతరం ఐటీ అధికారులు.. ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు. కాగా, బెంగళూరు నుంచి బైరే సంద్రకు లారీలో నగదును తరలించి, అక్కడి నుంచి తెలంగాణకు తరలించాలని ప్లాన్ చేసినట్లుగా భావిస్తున్నారు.